:: Welcome to NRI - Article ::

అమెరికాలో కేశవకు భారీగా థియేటర్లు

నిఖిల్ హీరోగా.. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘కేశవ’ సినిమాకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఫస్ట్‌లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది సినిమా టీం. విభిన్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న నిఖిల్‌పై ప్రేక్షకులు భారీగానే నమ్మకం ఉంచారు. అందుకే విభిన్న సినిమాలను ఆదరించే ఓవర్సీస్ ప్రియులు కూడా సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 ఓవర్సీస్‌లో కేశవపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలోపెట్టుకుని రెడ్‌హార్ట్ మూవీస్ సంస్థ అమెరికాలో డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చింది. అలబామా, ఆర్కనాస్, అరిజోనా, కాలిఫోర్నియా, డెట్రాయిట్, ఫ్లోరిడా, జార్జియో, ఇల్లినాయిస్, కన్సాస్, మిచిగాన్, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఓహియో, టెక్సాస్, విస్కిన్సన్ రాష్ట్రాలతోపాటు మరిన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 150 స్క్రీన్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బాహుబలి-2 విడుదలై మూడు వారాలు పూర్తి అవుతుండటంతో థియేటర్ల కొరత కూడా తగ్గిపోవడంతో పెద్ద సంఖ్యలోనే కేశవకు థియేటర్లను కేటాయించినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. మొత్తానికి కేశవ.. అభిమానులను ఆకట్టుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.