:: Welcome to NRI - Article ::

కేశవ.. సినిమా చూసిన ఎన్నారైల స్పందన ఇదీ

విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు నిఖిల్. స్వామిరారా సినిమా హిట్ దగ్గర నుంచి తన పంథాను మార్చుకుని కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నాడు. కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. వంటి హిట్స్ తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘కేశవ’తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓవర్సీస్‌లో ఓ రోజు ముందుగానే... అంటే గురువారం రాత్రి పూటే ప్రీమియర్స్ పూర్తయ్యాయి. అమెరికాలో దాదాపు 150 స్క్రీన్లలో విడుదలయిన కేశవపై ఎన్నారైలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
 
కొత్త కథాంశాలను ఎంచుకునే నిఖిల్.. ట్రైలర్‌తోనే సినిమా కంటెంట్‌ను చెప్పేశాడు. తన కుటుంబానికి హాని కలిగించిన వారిపై పగతీర్చుకునే వ్యక్తిగా ఇందులో నిఖిల్ కనిపిస్తాడు. అయితే అన్ని రివేంజ్ డ్రామా సినిమాల్లోలా కాకుండా ఇక్కడ హీరోకు ఓ అరుదైన వ్యాధి ఉండటమే వెరైటీ. ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోకపోతే మరణించే ఓ అరుదైన వ్యాధితో బాధపడే ఓ వ్యక్తిగా... రివేంజ్ తీర్చుకునే పాత్రలో నిఖిల్ ఒదిగిపోయాడని ఎన్నారై సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. సీరియల్ కిల్లర్‌గా మారి ఒక్కొక్కరిని చంపుతూ పోతుంటాడనీ, ఈ వరుస హత్యల మిస్టరీని చేధించే పాత్రలో ఇషా కొప్పికర్ బాగానే నటించిందని మరో ప్రేక్షకుడు తెలిపాడు. సినిమాలో వచ్చే ట్విస్టు‌లు బాగున్నాయని చెబుతున్నారు. ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్ట్, సన్నివేశాలు అయితే నిఖిల్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చంటున్నారు. సినిమాలో సాంగ్స్ కూడా బాగున్నాయంటున్నారు. కామెడీ టచ్ లేకపోవడం ఓ వర్గం ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేస్తుందనీ, అయితే నిఖిల్ సినిమాల్లో కామెడీ లేకపోయినా, కంటెంట్ ఉంటుందంటూ ఓ ఎన్నారై ట్వీట్ చేశాడు. మొత్తానికి నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనని తేల్చిచెబుతున్నారు.

 

Loading...