Jai-Simha-releases-in-Overseas

శాతకర్ణిలా.. ఓవర్సీస్‌లో ‘జై సింహా’ సత్తా చాటుతుందా..?

బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘జై సింహా’ విడుదలకు సిద్ధమయింది. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ఓవర్సీస్‌లో ఒకరోజు ముందుగానే జనవరి 11నే థియేటర్లలో సందడి చేయనుంది. జై సింహా ఓవర్సీస్ హక్కులను ‘సరిగమ సినిమాస్’ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. అమెరికా వ్యాప్తంగా మొత్తం 92 లొకేషన్లలో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఇప్పటికే విడుదలయిన పాటలు, ట్రైలర్.. అటు మాస్‌ను ఇటు క్లాస్‌ను ఆకట్టుకోగా.. సోమవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో విడుదల చేసిన ప్రీ రిలీజ్ ట్రైలర్.. సెంటిమెంట్ ప్రియుల మదిని దోచింది. 

 
కాగా బుధవారం విడుదలయిన అజ్ఞాతవాసికి మిక్స్‌డ్ టాక్ రావడంతో.. సినీ ప్రియుల దృష్టి ‘జై సింహా’పై పడింది. యాక్షన్, సెంటిమెంట్ మేళవింపులా కనిపిస్తున్న జై సింహాకు పాజిటివ్ టాక్‌ కనుక వస్తే.. మరోసారి సంక్రాంతి హీరోగా బాలయ్య నిలిచే అవకాశం ఉంది. గతేడాది గౌతమిపుత్ర శాతకర్ణితో సంక్రాంతికి హిట్ కొట్టిన బాలయ్య.. ఈ యేడాది జై సింహా అంటూ వస్తున్నారు. బాలయ్య కెరీర్లో మునుపెన్నడూ లేని విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఓవర్సీస్‌లో 1.66 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడు జై సింహా కూడా అమెరికాలో 92 స్క్రీన్లలో విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఫలితం ఏంటో మరికొద్ది గంటల్లో తేలనుంది.