Jai-Lava-Kusa-overseas-rights

జై లవకుశకు ఓవర్సీస్ రైట్స్‌కు భారీ డిమాండ్

ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన ‘జనతాగ్యారేజ్’ తర్వాత వస్తున్న ‘జై లవకుశ’ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్నయ్య కల్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా మూడు పాత్రల్లో నటించడంతో మంచి హైప్ వచ్చింది. ఈ సినిమాను ప్రారంభించే రోజే విడుదల తేదీ కూడా చెప్పేసింది చిత్ర బృందం.  సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు కూడా. గురువారం విడుదలయిన జై లవకుశ టీజర్ అందరి అంచనాలను దాటేసి మరీ ప్రేక్షకులను అలరిస్తోంది.

 అయితే తెలుగు రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఓవర్సీస్ విషయంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. మాస్ నుంచి క్లాస్‌కు విభిన్న సినిమాలతో మారుతూ వస్తున్న ఎన్టీఆర్‌కు ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు ఓవర్సీస్‌లో ఎన్నారై సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ కెరీర్‌లో హయ్యస్ట్ ఓవర్సీస్ గ్రాసర్‌గా నాన్నకు ప్రేమతో నిలిచింది. ఓవర్సీస్‌లో 2.02 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది ఈ సినిమా. ఆ తర్వాత 1.80 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి జనతా గ్యారేజ్ రెండో స్థానంలో నిలిచింది. నాలుగేళ్ల క్రితం వచ్చిన బాద్‌షా కూడా మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే కొల్లగొట్టింది.

 
ప్రస్తుతం చిత్రీకరిస్తున్న జై లవకుశకు చిత్ర నిర్మాతలు ఓవర్సీస్ హక్కుల కోసం రూ.14కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఇంత పెద్దమొత్తంలో ఎన్టీఆర్ సినిమాను ఓవర్సీస్ మార్కెట్‌లో డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. అందునా ఈ మేరకు సినిమా కలెక్షన్లు కొల్లగొట్టి డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టాలంటే కనీసం 3 మిలియన్ డాలర్ల మేర వసూలు అవ్వాలట. ఇప్పటివరకూ బాహుబలి తప్ప 3 మిలియన్ డాలర్లు దాటిన తెలుగు సినిమా ఏదీ లేకపోవడం గమనార్హం. మరి ఎన్టీఆర్ సినిమా ఓవర్సీస్‌ హక్కులను ఎంతకు కొనుగోలు చేస్తారో..? ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారో త్వరలోనే తేలనుంది.