:: Welcome to NRI - Article ::

విదేశాల్లోనూ ‘జాగ్వార్‌’ సందడి

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమార స్వామి తనయుడు నిఖిల్‌ గౌడ నటించిన జాగ్వార్‌ చిత్రాన్ని అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియాలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయాన్ని స్వయంగా కుమార స్వామి సోమవారం మీడియాకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో జాగ్వార్‌ తాము ఊహించినదానికంటే భారీగా సక్సస్‌ అయ్యిందన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ర్టేలియాలో ఏక కాలంలో 45 కేంద్రాల్లో జాగ్వార్‌ను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్నారు.

డిస్ట్రిబ్యూటర్ల తీరుపై గరం
శాండల్‌వుడ్‌లో కొందరు డిస్ట్రిబ్యూటర్లు అతిగా వ్యవహరిస్తున్నారని కుమార స్వామి ఆవేదన చెందారు. మొత్తం చిత్రరంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. తద్వారా నిర్మాతలను ఇబ్బందులో పడేస్తున్నారని విరుచుకుపడ్డారు. గాంధీనగర్‌లో తిష్టవేసిన ఇలాంటి కొద్దిమంది డిస్టిబ్యూటర్ల వల్ల సినీ పరిశ్రమకు చెడ్డపేరు వస్తోందన్నారు. తన కుమారుడు నటించిన జాగ్వార్‌ గాంధీనగర్‌తో సహా అనేక థియేటర్లలో హౌస్‌ఫుల్‌ కలెక్షన్లతో నడుస్తున్నా చిత్రాన్ని తీసేయడం బాధ కల్గించిందన్నారు. తనలాగే ఎందరో నిర్మాతలు డిస్టిబ్యూటర్ల ఏకపక్ష విధానాలతో విసిగివేసారి పోతున్నారన్నారు. ఇలాగైతే చిత్రాలు నిర్మించేదెలా? అని ప్రశ్నించారు. పరభాషా చిత్రాలైతే రాష్ట్రంలో ఏకంగా 150 నుంచి 250 థియేటర్లలో విడుదలవుతాయి. మరి కన్నడ చిత్రాలకు మాత్రం థియేటర్లే దక్కవు. ఇదెక్కడి చోద్యం అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు.

 

Loading...