:: Welcome to NRI - Article ::

బాహుబలిని దాటేందుకు కలెక్షన్ల టార్గెట్ ఇదే

బాహుబలి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కలెక్షన్ల పరంగా దుమ్మురేపిన సినిమా. తెలుగు సినీ పరిశ్రమ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. కలెక్షన్ల పరంగా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా కొల్లగొట్టింది. అదీ ఇదీ అని లెక్కలేకుండా.. అన్ని విషయాల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. మొత్తం మీద రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా ఈ సినిమా నిలిచింది. బాహుబలి సినిమా రిలీజ్ అయి ఏడాదిన్నర ముగిసినా.. దీని రికార్డులను దాటడం ఏ సినిమాకూ సాధ్యపడలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా విడుదల అయింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్ షోల ద్వారా రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కలెక్షన్లు మొదటి వారానికే పరిమితం కాకుండా ఉంటేనే బాహుబలి ఓవరాల్ కలెక్షన్లను దాటేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా మొత్తం 7.51 మిలియన్ డాలర్లు (51 కోట్ల 25 లక్షల 38వేల 725 రూపాయలు) సంపాదించింది. అమెరికాలో బాహుబలి రికార్డును దాటాలంటే ఖైదీ నెంబర్ 150 సినిమా ఈ మొత్తాన్ని కొల్లగొట్టాలి. ప్రీమియర్ షోల రికార్డును దాటేసిన చిరు.. మిగిలిన రికార్డులను కూడా దాటేస్తాడో లేదో మరికొద్ది రోజులయితే కానీ తేలదు.