:: Welcome to NRI - Article ::

రూ.1000 కోట్ల ‘బాహుబలి2’: కరణ్‌ జోహార్‌

ఫేస్‌బుక్ పేజీలో ప్రభాస్.. హార్ట్ టచింగ్ మెసేజ్

‘బాహుబలి ది కన్‌క్లూజన్’ రూ.వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నమోదైంది. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై హిందీ వెర్షన్ ‘బాహుబలి2’ని విడుదల చేసిన కరణ్‌ జోహార్‌ ట్విట్టర్‌లో ఈ చిత్రం వెయ్యి కోట్లకు చేరిందని ప్రకటించారు. ‘‘అత్యంత భారీ మైల్‌స్టోన్ను బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్ సినిమా ‘బాహుబలి’ రీచ్ అయింది’’ అని కరణ్‌ జోహార్‌ అందులో తెలిపారు. ‘బాహుబలి 2’ వెయ్యి కోట్ల మార్కును చేరుకోవడం చరిత్రగా ఆర్కా మీడియా సంస్థ తన ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ వేదికగా అభిమానులకు, రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నా మీద అమితమైన ఆదరాభిమానాలను చూపించిన అభిమానులను ఆత్మీయ ఆలింగనాలు. మనదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తున్న వారికి కృతజ్ఞతలు. తాను కలగన్న భారీ విజన్‌ని నేను తెరమీద ప్రతిఫలించగలనని నమ్మి, జీవితంలో అరుదైన, ఒక్కసారి మాత్రమే వచ్చే ‘బాహుబలి’ లాంటి అవకాశాన్ని నాకు ఇచ్చి, ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని ఆజన్మాంతం గుర్తుంచుకునేలా చేసిన రాజమౌళిగారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని అందులో తెలిపారు.
 
బీబీసీ పత్యేక కథనం
‘బాహుబలి’ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టిస్తోందని బీబీసీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. యు.ఎస్‌లో ఈ వారం మూడో హయెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిందనీ, హిందీతోపాటు తెలుగు, తమిళ వర్షన్లు కూడా కలుపుకొని యు.కెలో టాప్‌టెన్‌లో స్థానం సంపాదించిందనీ అందులో ప్రస్తావించారు. టాలీవుడ్‌ ప్రొడక్షన్‌లో బాలీవుడ్‌ స్థాయి ఫైట్లు, డాన్స్‌లు ఉన్నాయనీ, భావోద్వేగాలు సినిమా విజయానికి దోహదపడ్డాయని విశ్లేషించారు. రాజమౌళి బైట్‌తోపాటు ఫిలిం క్రిటిక్‌ మైక్‌ మెక్‌ కెహిల్‌ వాయిస్‌ను కూడా అందులో ప్రసారం చేశారు.