:: Welcome to NRI - Article ::

సినిమా లవర్స్ తప్పక చూడాల్సిన ‘గల్ఫ్’

పొట్టకూటి కోసం కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును వదిలేసి.. పరాయి దేశానికి వలస వెళ్లి.. అక్కడ బాధలను దిగమింగుకుని మరీ కుటుంబం కోసం కష్టాలు అనుభవిస్తున్న గల్ఫ్ కార్మికుల కోసం.. ఓ సినిమా వచ్చింది. సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ క్రైమ్ కథ.. వంటి సామాజిక ఇతివృత్తాలతో సినిమాలు తీసే పీ.సునీల్ కుమార్ రెడ్డి తాజాగా ‘గల్ఫ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. గల్ఫ్ కష్టాలు, ఓ ప్రేమకథ, కన్నతల్లిదండ్రుల కోసం తపన.. ఇలా పలు అంశాలను స్పృసిస్తూ సునీల్‌కుమార్ రెడ్డి తీసిన ‘గల్ఫ్’ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. 

 
సినిమాను ప్రేమించేవాళ్లు తప్పని సరిగా చూడాల్సిన చిత్రం ‘గల్ఫ్’ అని ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తన రివ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా చూశాక కత్తి మహేశ్ తన ఫేస్‌బుక్ పేజీలో రివ్యూ ఇచ్చారు. సామాజిక సమస్యలను కథాంశంగా తీసుకుని సినిమాలు తీసే సునీల్ కుమార్ రెడ్డి.. మరోసారి ‘గల్ఫ్’తో ఓ అద్భుతాన్ని సృష్టించారని చెప్పారు. ఈ సినిమాలో చాలా మంది ప్రవాసుల కథలు కనిపిస్తాయనీ, అవి ప్రతి ఒక్కరి మదిని తాకుతాయని, ఏడిపిస్తాయన్నారు. మాతృభూమి విలువ ఏంటో తెలియజేసేలా కథ, కథనం ఉంటాయన్నారు. కొత్త వాళ్లయినా డింపుల్, చేతన్ బాగానే నటించారని, వారి మధ్య ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుందన్నారు. థియేటర్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు సినిమాను ఫీల్ అయేలా, అనుభూతిని చెందేలా ‘గల్ఫ్’ ఉంటుందని కత్తి మహేశ్ వ్యాఖ్యానించారు. నిజజీవితానికి చాలా దగ్గరగా, మనకు తెలిసిన కథల్లా సినిమా ఉంటుందని, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం గల్ఫ్ అని తెలిపారు. కమర్షియల్ సినిమాల్లా కాకుండా ముగింపు భిన్నంగా ఇవ్వడంతో.. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా చిత్ర అనుభూతి మిగిలి ఉంటుందని, నిజాలను నిర్భయంగా చెప్పారన్నారు. మధ్యలో వచ్చే ఒక ఫైట్ సీన్ అవసరం లేదనిపిస్తుందని, మొత్తంగా చూస్తే ప్రవాసులు, వారి కుటుంబాలు, గల్ఫ్ వెళ్లాలనుకునేవారు, సినిమాను ప్రేమించేవాళ్లు చూడదగ్గ సినిమా ‘గల్ప్’ అని సినిమాను చూసినవాళ్లు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసులూ.. వీలుంటే మీరూ ఈ చిత్రాన్ని చూసేయండి.