geetha-govindham-collections

యూఎస్‌లో ‘గీత గోవిందం’ కలెక్షన్ల వర్షం..రికార్డు..

‘అర్జున్ రెడ్డి’గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండకు ‘గీత గోవిందం’ రూపంలో మరో భారీ హిట్ లభించింది. విజయ్‌ సరసన రష్మిక మందన్న, ఇతర తారాగణం నటించిన ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘గీత గోవిందం’ సందడి చేస్తోంది. ఈ సినిమాను చూసేందుకు ఎన్నారైలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఆదివారం నాటికి 2,084,822 డాలర్లు(రూ 14.60 కోట్లు) వసూళ్లయ్యాయని, సినిమా విజయవంతంగా దూసుకెళ్తోందని సినీవిశ్లేషకుడు తరణ్ ఆదర్ష్ ట్వీట్ చేశారు. 

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాల కలెక్షన్లు యూఎస్‌లో 2 మిలియన్ మార్క్‌కు సమీపంలో నిలిచాయి. విజయ్‌ను ఊరించిన ఈ రికార్డు ‘గీత గోవిందం’తో దక్కింది. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించి 2 మిలియన్ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా ‘గీత గోవిందం’ నిలిచింది.