Geetha-Govindam-three-days-collections

మిలియన్ డాలర్లకు చేరువలో గీత గోవిందం

విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన నటీనటులుగా నటించిన గీత గోవిందం సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పైరసీ అయిందని నిర్మాతలు ఆందోళన చెందినప్పటికీ ఈ సినిమా ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతోంది. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి సినిమాలు అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరాయి. తాజాగా ఇప్పుడు గీత గోవిందం సినిమాతో మూడోసారి మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరనున్నాడు విజయ్ దేవరకొండ. భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమా అమెరికాలోమంగళవారం 4 లక్షల 92 డాలర్లు, బుధవారం లక్షా 98 వేల 329 డాలర్లు, గురువారం లక్షా 32 వేల 873 డాలర్లను కొల్లగొట్టింది. మొత్తంగా 7 లక్షల 31 వేల 294 డాలర్లను రాబట్టింది. అంటే మన కరెన్సీలో 5 కోట్ల 12 లక్షలు. శుక్రవారం లేదా శనివారం ఈ సినిమా మిలియన్ మార్క్‌ను దాటేస్తుందని సినిమా విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. చేసిన ఐదు సినిమాలలోనే మూడు సినిమాలు మిలియన్ డాలర్లను దాటాయంటే విజయ్ మార్కెట్ ఎంతలా పెరిగిందో ఆలోచించాల్సిందే. కాగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 37 కోట్ల రూపాయల కలెక్షన్లు (గ్రాస్) వచ్చినట్లు తెలుస్తోంది.