geeta-govindam-record-collections-

చిరు సినిమాను దాటేసిన ‘గీత గోవిందం’

విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దుమ్మురేపుతోంది. బడా బడా హీరోల చిత్రాలకు ధీటుగా అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ చిత్రం మెగాస్టార్ సినిమాను కూడా దాటేసిందట. రికార్డులను కొల్లగొట్టడానికి చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదని నిరూపిస్తున్నాయి ఈమధ్య కాలంలో వస్తున్న చిత్రాలు. అందుకు తాజా ఉదాహరణే ‘గీత గోవిందం’. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్లను వసూలు చేసిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ఓవర్సీస్ లోనూ దుమ్మురేపుతోంది. విడుదలై నాలుగు వారాలు పూర్తవుతోన్నా.. ఇంకా ఈ చిత్రం అమెరికాలో వసూళ్ల పరంపర కొనసాగిస్తూనే ఉంది.

గత వారం 2 మిలియన్ మార్క్ సాధించిన ‘గీత గోవిందం’ చిత్రం.. అమెరికా టాప్-10 టాలీవుడ్ చిత్రాల్లో చోటు దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ఓవర్సీస్‌లో 2.447 మిలియన్ డాలర్ల వసూళ్లతో టాప్-9లో ఉన్న ‘ఫిదా’ను టాప్-10కు, టాప్-8లో ఉన్న ‘ఖైదీ నంబర్ 150’ని టాప్-9కి పంపంచి.. ప్రస్తుతానికి టాప్-8లో సెటిలయ్యింది. ‘గీత గోవిందం’ కలెక్షన్లు ఇలాగే కొనసాగితే.. త్వరలో ఓవర్సీస్‌లో ‘అ..ఆ’, ‘మహానటి’ కలెక్షన్లను కూడా ఈజీగా దాటేసి.. ఏకంగా టాప్-6కు ఎగబాకే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ రికార్డుల విషయానికొస్తే టాప్-1 అండ్ 2 పొజిషన్లలో ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలు కొనసాగుతుండగా.. మూడవ స్థానంలో ‘రంగస్థలం’, నాలుగు, ఐదు స్థానాల్లో ‘భరత్ అనే నేను’, ‘శ్రీమంతుడు’ ఉన్నాయి. ‘గీత గోవిందం’ ఫైనల్ లెక్కలు తేలే లోగా ఇంకెన్ని రికార్డులు విజయ్ ఖాతాలో చేరతాయో చూడాలి మరి.