First-Weekend-Collections-Report-of-NTR-Kathanayakudu-VVR-and-F2

మొదటి వీకెండ్‌లో మూడు సినిమాల కలెక్షన్ల రిపోర్ట్..!

సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. మూడు భారీ సినిమాలు సినీ అభిమానుల ముందుకు వచ్చాయి. మొదటగా బాలకృష్ణ- క్రిష్ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత రామ్‌చరణ్-బోయపాటి కాంబోలో ‘వినయ విధేయ రామ’, వెంకీ-వరుణ్ మల్టీస్టారర్ ‘ఎఫ్-2’ థియేటర్లలో సందడి చేశాయి. ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందనను తెచ్చుకుంది. రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’కు మిశ్రమ స్పందన వచ్చినా.. మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఇక ఆఖరుగా వచ్చిన ఎఫ్-2 సినిమా.. సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ వర్గాలను ఆకట్టుకుని కలెక్షన్లను కొల్లగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ మూడు సినిమాలు భారీ స్థాయిలోనే విడుదలయ్యాయి.
 
అమెరికాలో ఈ మూడు సినిమాల వీకెండ్ కలెక్షన్ల రిపోర్టులను సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ప్రీమియర్ల ద్వారా జనవరి 8వ తారీఖునే విడుదలయింది. అమెరికాలో మొత్తం అయిదు రోజుల్లో ఈ సినిమాకు 8లక్షల 14వేల 467 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపు 5కోట్ల 78 లక్షల రూపాయలన్నమాట. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా.. ఎన్నారైలు, సినీ అభిమానులు, సినీ విమర్శకుల ప్రశంసలను పొందింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత వరుసగా వచ్చిన పేట, వినయ విధేయ రామ, ఎఫ్-2 సినిమాల ప్రభావం.. ఎన్టీఆర్ కథానాయకుడిపై పడింది. సినీ వర్గాలు ఊహించిన రేంజ్‌లో ఈ సినిమాకు కలెక్షన్లు రాలేదు. మరి రెండో వారంలోనయినా ఈ సినిమాకు ఆశించిన రీతిలో కలెక్షన్లు వస్తాయో లేదో వేచిచూడాలి. 
 
ఇక ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన వినయ విధేయ రామకు కూడా ఊహించని రీతిలో ఓవర్సీస్ కలెక్షన్లు ఉన్నాయి. జనవరి 11న ఈ సినిమా విడుదలయింది. మొదటి వీకెండ్‌లో (శుక్ర, శని, ఆదివారాల్లో..) ఈ సినిమా కేవలం 2లక్షల 41వేల 721 డాలర్లను మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే దాదాపు ఒక కోటీ 71 లక్షల రూపాయలన్నమాట. మాస్ సినిమాలను ప్రవాసులు పెద్దగా చూడరు. ప్రయోగాత్మక, కుటుంబ కథా చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. దీంతో ఫుల్ మాస్ సినిమా అయిన వినయ విధేయ రామకు.. పెద్దగా కలెక్షన్లు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వచ్చిన రంగస్థలం.. ఓవర్సీస్‌లో రికార్డులు సృష్టించినా.. వినయ విధేయ రామకు మాత్రం ఓవర్సీస్‌లో నష్టాలే మిగిలాయని తెలుస్తోంది. 
 
ఇక చివరగా వచ్చిన ఎఫ్-2.. అన్ని వర్గాలను మెప్పించి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శనివారం విడుదలయిన ఈ సినిమా.. మొదటి వీకెండ్‌లో (అంటే శని, ఆదివారాల్లో) 9లక్షల 26వేల 566 డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా 6కోట్ల 58 లక్షల రూపాయలను కొల్లగొట్టింది. ఈ సినిమాకు రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓవర్సీస్‌లో 2మిలియన్ డాలర్ల మార్కుకు చేరువవుతుందని డిస్ట్రిబ్యూటర్లు అంచనా వేస్తున్నారు.