Festival-day-Collections-winner-in-all-Sankranthi-Release-Movies

సంక్రాంతి రోజు.. కలెక్షన్ల పండుగ చేసుకున్న సినిమా ఏదంటే..

సంక్రాంతి పండుగ ముగిసినా.. సినీ సందడి మాత్రం మరింత జోరుమీదుంది. పండుగ సినిమాలకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ యేడాది సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలయిన సంగతి తెలిసిందే. వాటిల్లో మూడు తెలుగు సినిమాలు కాగా.. మరొకటి రజనీ ‘పేట’ సినిమా.. జనవరి 9వ తారీఖు నుంచి మొదలుకుని.. వరుసగా సినిమాలన్నీ విడుదలయ్యాయి. మొదటగా జనవరి 9న ఎన్టీఆర్ కథానాయకుడు, పదో తారీఖున పేట, 11వ తారీఖున వినయ విధేయ రామ, 12వ తారీఖున ఎఫ్-2 థియేటర్లలో సందడి చేశాయి. వీటిల్లో ఒక్కో సినిమాకు ఒక్కో రకమయిన టాక్ రాగా.. ఎఫ్-2 సినిమా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఎన్టీఆర్‌కు ఘన నివాళి ఇచ్చిన సినిమాగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’కి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక వినయ విధేయ రామ సినిమా ఫ్యాన్స్‌‌కు, మాస్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. రజనీ అభిమానులను ‘పేట’ అలరించింది. ఈ నాలుగు సినిమాలు సంక్రాంతి పండుగను బాగానే క్యాష్ చేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమాలు విడుదలయ్యాయి. అక్కడ ఈ సినిమాల కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

 
మిగిలిన రోజులన్నింటి కంటే.. పండుగ రోజు ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయి..? అన్న విషయంపై సినీ అభిమానులు చర్చించుకుంటుంటారు. పండగరోజయిన 15వ తారీఖు.. మంగళవారం నాడు ఏ సినిమా కలెక్షన్లను కొల్లగొట్టిందనే అంశంపై ఆసక్తి కనపరుస్తుంటుంటారు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల కంటే అమెరికాలో ఏ సినిమాకు అత్యధిక కలెక్షన్లు వచ్చాయన్న విషయాన్ని కూడా ఆరా తీస్తుంటారు. ఈ నాలుగు సినిమాలకు అమెరికాలో ఆశ్చర్యకరమైన రీతిలో కలెక్షన్లు వచ్చాయి. 
 
సంక్రాంతి సినిమాల్లో ఆఖరుగా వచ్చిన ‘ఎఫ్-2’కు అమెరికాలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. సంక్రాంతి పండుగ రోజయిన మంగళవారం ఈ సినిమాకు 109 లొకేషన్లలో 1,30,347 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం మీద మంగళవారం నాటికి ఈ సినిమా 11,24,540 డాలర్లను (అంటే దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగానే) కొల్లగొట్టింది. మొత్తం మీద ఈ సినిమా అమెరికాలో ఒక మిలియన్ డాలర్‌ను దాటిన ఈ ఏడాది మొట్టమొదటి సంక్రాంతి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. 
 
ఎఫ్-2 తర్వాత పేట సినిమాకు మంగళవారం 186 లొకేషన్లలో 73,334 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో అమెరికాలో విడుదలయిన ఈ సినిమాను ప్రవాసులు విశేషంగా ఆదరిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 20,44,652 డాలర్లను (అంటే దాదాపు 14 కోట్ల రూపాయలకు పైగానే..) కొల్లగొట్టింది. 
 
ఈ రెండింటి తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు మంగళవారం అమెరికాలో అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. మొత్తం 103 లొకేషన్లలో మంగళవారం ఈ సినిమా 16,443 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తం మీద ఈ సినిమా మంగళవారం నాటికి 8,87,329 డాలర్లను (దాదాపు 6 కోట్ల రూపాయలకు పైగానే..) కొల్లగొట్టింది. 
 
ఇక పూర్తి మాస్ ఎంటర్‌టైనర్ అయిన వినయ విధేయ రామ సినిమాకు సంక్రాంతి పర్వదినం నాడు.. 60 లొకేషన్లలో 3,937 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. మంగళవారం నాటికి ఈ సినిమా మొత్తం మీద 2,48,011 డాలర్లను( అంటే ఒక కోటి 76 లక్షల రూపాయలన్నమాట..) రాబట్టగలిగింది. గతేడాది అత్యధిక కలెక్షన్లను సాధించిన రంగస్థలం తర్వాత విడుదలయిన ఈ సినిమాకు.. ఇంత తక్కువ స్థాయిలో కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.