F2-Movie-total-collection-Report

ఎఫ్-2 సినిమాకు అమెరికాలో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా వచ్చిన వెంకీ-వరుణ్ మల్టీస్టారర్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా విడుదలయిన ఈ సినిమాకు.. ఎన్నారైలు ఫిదా అయ్యారు. సంక్రాంతి సందర్భంగా మరో రెండు సినిమాలు కూడా ఈ సారి విడుదయ్యాయి. రామ్ చరణ్ నటించిన వినయవిధేయ రామ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కావడం, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ లేకపోవడం ఎఫ్-2కు కలిసి వచ్చింది. దీంతో ఓవర్సీస్‌లో ఎఫ్-2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
 
జనవరి 24 వరకు ఎఫ్-2 సినిమాకు అమెరికాలో 18 లక్షల 99వేల 373 డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. అంటే దాదాపు 13.48 కోట్ల రూపాయలకు పైగానే.. మొత్తానికి లాంగ్ రన్‌లో ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల మార్కును దాటేస్తుందని అమెరికాలోని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటేసిందని ఆ చిత్ర నిర్మాత అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా లాబాల బాట పట్టినట్లు ఈ చిత్రవర్గాలు చెబుతున్నాయి. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడం, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకోవడంతో ఎఫ్-2 సినిమా ఈ వారంలో కూడా పెద్ద మొత్తంలో కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి.