F2-Brakes-NTR-movie-Records

అమెరికాలో ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసిన ఎఫ్-2

సంక్రాంతి సందర్భంగా వచ్చిన వెంకీ-వరుణ్ మల్టీస్టారర్ బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా విడుదలయిన ఈ సినిమాకు.. ఎన్నారైలు ఫిదా అయ్యారు. సంక్రాంతి సందర్భంగా మరో రెండు సినిమాలు కూడా ఈ సారి విడుదయ్యాయి. రామ్ చరణ్ నటించిన వినయవిధేయ రామ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ కావడం, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ లేకపోవడం ఎఫ్-2కు కలిసి వచ్చింది. దీంతో ఓవర్సీస్‌లో ఎఫ్-2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలయిన మొదటి వీకెండ్‌లోనే ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిన ఈ సినిమా.. మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 

 
సోమవారం (జనవరి 28) నాటికి.. అమెరికాలో ఈ సినిమా మొత్తం 20 లక్షల 56వేల 866 డాలర్లను (అంటే మొత్తం 14 కోట్ల 67 లక్షల రూపాయలకు పైగానే) కొల్లగొట్టినట్టు డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు. ఏ ఏడాది సంక్రాంతి సినిమాల్లో రెండు మిలియన్లు దాటిన చిత్రం ఇదే కావడం గమనార్హం. అంతేకాకుండా ఈ ఏడాది రెండు మిలియన్ల డాలర్ల కలెక్షన్లను దాటిన మొట్టమొదటి సినిమా కూడా ఇదే. వరుణ్ తేజ్‌ హీరోగా వచ్చిన ఫిదా సినిమా 2.07 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. తాజాగా వరుణ్ నటించిన మరో సినిమా ఎఫ్-2 కూడా రెండు మిలియన్ డాలర్ల మార్కును దాటేయడం గమనార్హం. సీనియర్ హీరోల్లో వెంకటేష్‌ ఒక్కరికే రెండు మిలియన్ డాలర్లు దాటిన సినిమా ఉండటం విశేషం. 
 
అమెరికాలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఎఫ్-2.. ఓ రికార్డును బ్రేక్ చేసింది. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమా ఓవరాల్ కలెక్షన్లను దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్‌కు రెండు మిలియన్ డాలర్ల కలెక్షన్ల మార్కును చేరిన మొట్టమొదటి సినిమా ‘నాన్నకు ప్రేమతో..’. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో.. అరవింద సమేత తప్ప మిగిలినవి ఏవీ.. ఆ మార్కును దాటలేదు. నాన్నకు ప్రేమతో సినిమాకు ఓవర్సీస్‌లో 2.02 మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాగా.. అరవింద సమేత సినిమాకు.. 2.18 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. తాజాగా ఎఫ్-2 సినిమా.. నాన్నకు ప్రేమతో సినిమా రికార్డును దాటేసింది. ఎఫ్-2 సినిమాకు ఇప్పటివరకు 2.05 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ వారాంతంలో కలెక్షన్లు మరిన్ని పెరిగే అవకాశాలున్నాయని డిస్ట్రిబ్యూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.