Bharat-ane-nenu-overseas-booking-start

మహేశ్ సినిమా.. అమెరికాలో భారీ స్థాయిలో విడుదల

తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి క్రేజ్ ఉంటుందని అందరికీ తెలిసిందే. కొన్ని తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ అమెరికాలో కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా తెలుగు హీరోల్లో మహేశ్ సినిమాలకు అమెరికాలో కలెక్షన్లు భారీస్థాయిలో ఉంటాయి. మరికొద్దిరోజుల్లో విడుదల కాబోతున్న మహేశ్ తాజా సినిమా భరత్ అనే నేను కూడా అమెరికాలో భారీ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.  కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ గతంలో నటించిన శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

మళ్లీ వారి కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ డి.వి.వి.దానయ్య ఎక్కడా కాంప్రమయిజ్ కాకుండా సినిమా నిర్మించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమాపై భారీ అంచనాలుండటంతో పెద్ద ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు. అమెరికాలో 320లొకేషన్లలలో ఉన్న 750 స్క్రీన్లలో సినిమా విడుదల చేయబోతున్నారు. కాగా ఇప్పటికే కొన్ని స్క్రీన్లలో ప్రీమియర్ షో టికెట్లకు ఆన్‌లైన్ బుకింగ్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ 10వ తారీఖు నాటికి అమెరికాలో మొత్తం స్క్రీన్ల ప్రీమియర్ బుకింగ్స్ అందుబాటులో ఉంటాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఓవర్సీస్‌లో ప్రిమియర్‌షో టిక్కెట్‌ ధర 20 డాలర్లుగానూ,  రెగ్యూలర్ ‌షో టిక్కెట్ ధర 15 డాలర్లుగా నిర్ణయించారు. 

గత సంవత్సరం విడుదలైన మహేశ్ సినిమా స్పైడర్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అమెరికాలో ప్రీమియర్లకే ఒక మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. కొరటాల శివ, మహేశ్ కాంబినేషన్‌లో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న భరత్ అను నేను.. సినిమా ప్రీమియర్ల ద్వారానే 1.5 మిలియన్ డాలర్లను కొల్లగొడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.