:: Welcome to NRI - Article ::

ప్లేబ్యాక్‌ సింగర్‌... బాలకృష్ణ

నందమూరి నటసింహం నేపథ్య గానంలో తొలి అడుగులు వేసింది. తొలిసారిగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ ఈ కొత్త క్రేజీ కాంబినేషనకు తగ్గట్లుగా సరికొత్తగా సింగర్‌ అవతారమెత్తారు. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత వి. ఆనంద ప్రసాద్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తన 101వ చిత్రం కోసం ఆయన ఈ కొత్త ఫీట్‌ చేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం కోసం 40 రోజుల భారీ షెడ్యూల్‌కి కోసం చిత్రయూనిట్‌ గురువారం సాయంత్రం పోర్చుగల్‌కు ప్రయాణమైంది. కొన్ని పాటలతో సహా సినిమాలోని కీలక సన్నివేశాలు, పాటలు, యాక్షన ఘట్టాల్లో అధిక భాగం ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారు. ఆ షెడ్యూల్‌లో చిత్రీకరించే ఓ పక్కా మాస్‌ పాట కోసం అనూప్‌ రూబెన్స్‌ సంగీత బాణీలో, భాస్కరభట్ల సాహిత్యాన్ని బాలకృష్ణ హుషారుగా పాడేశారు. బాలకృష్ణ గళానికి కోరస్‌ గొంతు కలపగా ‘మావా.. ఏక్‌ పెగ్‌ లావో...’ అంటూ సాగే ఈ హుషారైన గీతం విన్నవాళ్ళు ఇప్పటికే వహ్వా అంటున్నారు.
 
‘‘బాలకృష్ణ గారికి సంగీతం మీద మంచి అభిరుచి ఉందని తెలుసు. కానీ, అతి తక్కువ సమయంలో ఆయన అంత చక్కగా, ప్రొఫెషనల్‌ సింగర్‌లా పాడడం చూసి ఆశ్చర్యపోయాం. పాటలు విడుదలయ్యాక అందరూ ప్రత్యేకంగా చెప్పుకుంటారు’’ అని పూరీ జగన్నాథ్‌ వ్యాఖ్యానించారు. నిర్మాత సైతం ‘‘భారీగా నిర్మిస్తున్న మా చిత్రానికి అదనపు విలువ బాలయ్య స్వరం. ఇలా చేస్తే బాగుంటుందని చెప్పగానే, ఓకే అంటూ పాడడానికి ఆయన ఒప్పుకోవడం సంతోషంగా అనిపించింది. ఈ పాట విన్నప్పుడు అభిమానులు పండగ చేసుకోవడం ఖాయం’’ అన్నారు. ఇక యువ సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ ఆనందానికైతే అవధులు లేవు. ‘‘బాలకృష్ణ గారి లాంటి ఒక లెజెండ్‌ నేను స్వరపరచిన గీతాన్ని తొలి పాటగా పాడడం ఎప్పటికీ మర్చిపోలేను. తక్కువ టైమ్‌లో పక్కా ప్రొఫెషనల్‌గా ఆయన పాడిన పాట కచ్చితంగా ఛార్జ్‌ బస్టర్‌ సాంగ్‌ అవుతుంది’’ అని ఉద్వేగంగా అన్నారు.
 
పాటలోని ఊపుకు తగ్గట్లు, పాడుతున్నంత సేపూ రికార్డింగ్‌ థియేటర్‌లో ఉత్సాహం ఉరకలెత్తించిన బాలకృష్ణ కూడా తెర మీదే కాక, తెర వెనుక కూడా ఈ సినిమా అందించిన కొత్త పాత్రతో సహజంగానే ఆనందంగా ఉన్నారు. సినిమాకు ప్రాణం సంగీతం, పాటలు అని నమ్మే శతచిత్ర కథానాయకుడు బాలకృష్ణ గతంలో హుద్‌ హుద్‌ తుపాను బాధితుల సహాయార్థం సినీ పరిశ్రమ చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా అందరి ఎదుటా పాట పాడి, ఆశ్చర్యపరిచారు. ఇప్పుడిలా నేరుగా రికార్డింగ్‌ థియేటర్‌లో తన ప్రతిభ చూపెట్టారు. మొత్తానికి మాఫియా నేపథ్యంలో, బాలకృష్ణను కొత్త హెయిర్‌ స్టయిల్‌, కొత్త తరహా కాస్ట్యూమ్స్‌లో చూపించే ఈ 101వ చిత్రం దసరా కానుకగా మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో!