:: Welcome to NRI - Article ::

ఆకాశమే హద్దు

ప్రభాస్‌, యస్‌.యస్‌. రాజమౌళి కాంబినేషన్ ఫిల్మ్‌ ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. మొదటి భాగమే సంచలనం సృష్టించిందనుకొంటే, రెండో భాగం విడుదలకు ముందే ఊహకు అందనంత క్రేజ్‌తో బిజినెస్‌ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రదర్శించడానికి మన దేశంలో 6500 తెరలు సిద్ధమవుతున్నాయి. అదే పెద్ద విశేషం అనుకుంటే దేశం కాని దేశం అమెరికాలోనూ ఈ చిత్రంపై అనూహ్యమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగా యు.ఎస్‌., కెనడా కలిపి ఉత్తర అమెరికాలో ఏకంగా వెయ్యికి పైగా స్ర్కీన్స్‌లో ‘బాహుబలి: ద కన్‌క్లూజన్’ విడుదలవనుండటం సరికొత్త చరిత్ర. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 1005 స్కీన్స్‌లో విడుదల చేస్తున్నట్లు అక్కడి పంపిణీ సంస్థ గ్రేట్‌ ఇండియా ఫిలిమ్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. యు.ఎస్‌.లో 900, కెనడాలో 150 స్ర్కీన్స్‌లో ‘బాహుబలి 2’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులోని విశేషమేమంటే చాలా హాలీవుడ్‌ సినిమాలు ఈ స్థాయిలో విడుదల కావు. అంటే అనేక హాలీవుడ్‌ సినిమాల కంటే భారీ స్థాయిలో అమెరికా, కెనడాలో ‘బాహుబలి 2’ విడుదలవుతుండటం... ఏ విధంగా చూసినా గొప్ప విషయం. విడుదల సమీపిస్తున్న కొద్దీ ఈ సినిమాపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాటిలో ‘ప్రభాస్‌ మూడు పాత్రల్లో కనిపించనున్నాడంట’ అనేది కూడా ఒకటి. శివుడు, అమరేంద్ర బాహుబలి పాత్రలతో పాటు మహేంద్ర బాహుబలి అనే మరో పాత్రలోనూ ఆయన కనిపించనున్నాడంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే శివుడే మహేంద్ర బాహుబలి అనే విషయం మొదటి ‘బాహుబలి’లోనే స్పష్టంగా తెలిసినా, ఆ విషయం విస్మరించి మరీ మహేంద్ర బాహుబలి అనేది మూడో పాత్రగా వారు పేర్కొంటుండటం విచిత్రం. అనుష్క, రానా, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

 

Loading...