AWE-movie-collection-in-Overseas

అమెరికాలో రికార్డుస్థాయి వసూళ్లతో అదరగొడుతున్న ‘అ.!’

మొట్టమొదటిసారి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. నిత్యామీనన్, రెజీనా, కాజల్, ప్రియదర్శి, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారగణంతో వచ్చిన ‘అ..!’.. సినీ ప్రేక్షకుల మదిని కొల్లగొట్టింది. కొత్త సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న నానుడిని నిజం చేసింది. సినీ విమర్శకుల ప్రశంసలను పొందిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా విడుదలయింది. ప్రయోగాత్మక చిత్రాలను ఆదరించడంలో ముందుండే ప్రవాసులు... అ..! చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాపై డాలర్ల వర్షం కురిపిస్తున్నారు. అమెరికాలో విడుదలయినప్పటి నుంచి సోమవారం వరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 

 
గురువారం ప్రీమియర్ల ద్వారా ఒక లక్షా 26వేల 852 డాలర్ల కలెక్షన్లు రాగా.. శుక్రవారం లక్షా 41వేల 514 డాలర్లను అ..! కొల్లగొట్టింది. శనివారం ఒక లక్షా 81వేల 139 డాలర్లను, ఆదివారం ఒక లక్షా 30వేల 771 డాలర్లను, సోమవారం 56వేల 655 డాలర్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది. మొత్తం మీద విడుదలయిన అయిదు రోజుల్లోనే ఈ సినిమా 6లక్షల 36వేల 931 డాలర్లను (4కోట్ల 13 లక్షల రూపాయలను) రాబట్టింది. అమెరికాలో అ..! సినిమా వసూళ్లు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయంటూ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అతి త్వరలోనే ఈ సిినిమా ఒక మిలియన్ డాలర్ మార్కును చేరుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.