:: Welcome to NRI - Article ::

మరో అరుదైన రికార్డు క్రియేట్ చేసిన అర్జున్‌రెడ్డి..

ఇప్పుడు టాలీవుడ్‌లో యువతను ఉర్రూతలూగిస్తున్న సినిమా.. అర్జున్‌రెడ్డి.. బోల్డ్ డైలాగ్స్, సీన్లతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. సూపర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాలబాటలో పడ్డారని ట్రేడ్ వర్గాల టాక్. విజయ్ దేవరకొండ హీరోగా, షాలిని పాడే హీరోయిన్‌గా సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. రామ్‌గోపాల్ వర్మ, రాజమౌళి, క్రిష్, దేవకట్టా వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 
 
అయితే విడుదలయి వారం రోజులు కూడా కాకముందే ఈ సినిమా పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అర్జున్‌రెడ్డి సినిమా విడుదలయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఈ సినిమాను నిర్వాణ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 89 థియేటర్లో అమెరికాలో విడుదలయిన ఈ సినిమా కేవలం అయిదు రోజుల్లోనే.. అంటే మంగళవారం నాటికి 11 లక్షల ఒక వేయి 167 డాలర్లను కలెక్ట్ చేసింది. ఇంత తక్కువ థియేటర్లలో విడుదలయినా అతి తక్కువ సమయంలోనే ఒక మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతకుముందు విడుదలయిన ఏ సినిమాలు కూడా ఈ అరుదైన ఫీట్‌ను సాధించలేకపోయాయి. 
 
వరుణ్ తేజ్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా సినిమా కూడా అయిదు రోజుల్లోనే అమెరికాలో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటినా.. థియేటర్ల సంఖ్య మాత్రం అర్జున్‌రెడ్డి కంటే ఎక్కువే. దాదాపు 134 స్క్రీన్లలో ఫిదా సినిమా అమెరికాలో విడుదలయింది. నాని నిన్నుకోరి సినిమా 139 థియేటర్లలో విడుదలయి 9 రోజుల్లో మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టగా.. అల్లు అర్జున్ ‘డీజే’ 162 థియేటర్లలో 9 రోజుల్లో మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ సినిమా 163 స్క్రీన్లలో ఆరు రోజుల్లో ఈ రికార్డును నమోదు చేయగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా 224 థియేటర్లలో విడుదలయి ఒక మిలియన్ డాలర్ల మార్కును అయిదు రోజుల్లో చేరుకుంది. మొత్తానికి అత్యంత తక్కువ థియేటర్లలో విడుదలయి తక్కువ సమయంలో మిలియన్ డాలర్ల కలెక్షన్లను కొల్లగొట్టిన సినిమాగా అర్జున్ రెడ్డి నిలిచిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కాగా ఈ గురువారం నుంచి అమెరికాలో మరో 25 థియేటర్లలో అర్జున్‌రెడ్డి సినిమా సందడి చేయబోతోంది.