:: Welcome to NRI - Article ::

అర్జున్‌రెడ్డిని దాటలేకపోయిన జై లవకుశ, స్పైడర్

ఎన్టీఆర్ హీరోగా త్రిపాత్రాభినయంలో నటించిన జై లవకుశ, మహేశ్-మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన స్పైడర్ సినిమాలు.. దసరాకు థియేటర్లలో సందడి చేశాయి. క్లాస్ అండ్ మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా జై లవకుశ, యాక్షన్ థ్రిల్లర్‌గా స్పైడర్.. అభిమానులను అలరించాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను నమోదు చేశాయి. మొదటి నాలుగు రోజుల్లోనే జై లవకుశ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను దాటేయగా.. 12 రోజుల్లోనే స్పైడర్ 150 కోట్ల రూపాయల మార్కును చేరుకున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు ఓవర్సీస్‌లోనూ విడుదలయ్యాయి. అక్కడ కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్లనే రెండు సినిమాలు రాబట్టాయి. 

జై లవకుశ, స్పైడర్ రెండు సినిమాలు ఓవర్సీస్‌లో ఇప్పటివరకు 1.56 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేశాయి. ఓవర్సీస్‌లో జై లవకుశ సినిమాను ఓవర్సీస్‌లో 10.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 1.56 మిలియన్ డాలర్లు(10 కోట్ల 67 లక్షల రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. అడ్వర్టైజింగ్‌తోపాటు ఇతర ఖర్చులను కూడా రాబట్టుకోవాల్సి ఉంది కనుక డిస్ట్రిబ్యూటర్లకు జై లవకుశ కాస్త తక్కువ నష్టాలను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. ఇక స్పైడర్ సినిమా విషయానికి వస్తే.. ఓవర్సీస్‌లో ఈ సినిమాను తెలుగు తమిళ హక్కులతో కలిపి మొత్తం 23.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు 1.56 మిలియన్ డాలర్లు(10 కోట్ల 67 లక్షల రూపాయలు) కలెక్ట్ అయ్యాయి. డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా భారీ నష్టాన్నే మిగిల్చిందని చెప్పవచ్చు. 

ఈ రెండు సినిమాలతో పోల్చితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో లాభాలను తెచ్చిపెట్టిన చిన్న సినిమా అర్జున్‌రెడ్డి. వివాదాలతో మొదలై సూపర్‌హిట్ టాక్‌ తెచ్చుకుని కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. కేవలం 5 కోట్లరూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా పదింతలకు పైగా లాభాన్ని తెచ్చిపెట్టింది. సందీప్‌ వేగా దర్శకత్వంలో, విజయ్ దేవరకొండ, శాలిని పాండే కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్‌లోనూ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అమెరికాలో అర్జున్‌రెడ్డి సినిమాకు 1.78 మిలియన్ డాలర్ల (11కోట్ల 51 లక్షల రూపాయలు) కలెక్షన్లు వచ్చాయి. దీని డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా చాలా చాలా తక్కువ ధర కావడం గమనార్హం. మొత్తానికి ఓవర్సీస్‌లో జై లవకుశ, స్పైడర్ సినిమాలతో పోల్చితే కాస్త ఎక్కువ కలెక్షన్లనే అర్జున్‌రెడ్డి కొల్లగొట్టడం గమనార్హం.