another-bumper-offer-from-mahanati

బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘మహానటి’ యూనిట్

ఇటీవలే విడుదలైన ‘మహానటి’ సినిమా ఎంతటి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. దేశంలోనే కాక విదేశాల్లో సైతం కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ అభినయానికి ఫిదా అయ్యారు ప్రేక్షకులు.

 
అలనాటి నటి సావిత్రి జీవిత కథను కళ్లకు కట్టినట్లు చూపించారని టాక్ రావడంతో చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా అంతా థియేటర్స్ బాట పట్టేశారు. ముఖ్యంగా 55 ఏళ్ళు పైబడిన వారైతే ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మరీ ఈ సినిమా చూస్తున్నారు. దీంతో ఎంతో సంతోష పడుతున్న చిత్రయూనిట్.. ఇప్పటికే వృద్దాశ్రమాల్లో ఉండే వృద్ధుల కోసం ‘‘మేమే మీ దగ్గరకు వస్తాం.. మీ ఓల్డ్ ఏజ్ హోమ్ లోనే సినిమా చూసి మీరంతా సంబరాలు చేసుకోండి’’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
అయితే తాజాగా ‘సినిమా టికెట్స్ ఉచితంగా ఇస్తాం.. సినిమా చూసేయండి’ అంటూ మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాకపోతే ఈ ఆఫర్‌ని కేవలం అమెరికాలోని కొన్ని లొకేషన్స్‌కి మాత్రమే పరిమితం చేసింది. అమెరికాలో మహానటి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్వాణ సినిమాస్ వారు 55 ఏళ్లకు పైబడిన అందరికీ ఉచితంగా ఈ టికెట్స్ అందిస్తున్నారు. శనివారం, ఆదివారం రోజుల్లో ఈ టికెట్స్ అందిస్తున్నామని పోస్టర్ ద్వారా ప్రకటించారు.