Akhil-new-movie-Mr-Majnu-premiere-collections

అమెరికాలో ఆ రెండు సినిమాల రికార్డును బ్రేక్ చేయలేకపోయిన మిస్టర్ మజ్ను

అక్కినేని అఖిల్ హీరోగా... వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ మజ్ను’ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. అఖిల్, హలో వంటి ఫెయిల్యూర్స్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో మిస్టర్ మజ్నుపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల కంటే ఒకరోజు ముందుగానే జనవరి 24న గురువారం ప్రీమియర్ల ద్వారా 153 లొకేషన్లలో మిస్టర్ మజ్ను సందడి చేసింది. 

 
మిస్టర్ మజ్ను సినిమా.. 81,176 డాలర్ల కలెక్షన్లను ప్రీమియర్ షోల ద్వారా కలెక్ట్ చేసింది. అంటే దాదాపు 57లక్షల 62 వేల రూపాయలన్నమాట. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో.. మిస్టర్ మజ్నుపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో అమెరికాలో ప్రీమియర్ షో కలెక్షన్లు రాలేదు. అఖిల్ గత రెండు సినిమాల కంటే ఈ సినిమాకే తక్కువ కలెక్షన్లు వచ్చాయి. మొదటగా వచ్చిన ‘అఖిల్’ సినిమాకు 90వేల 268 డాలర్లు రాగా (64 లక్షల రూపాయలకు పైగానే.. ).. ఆ తర్వాత వచ్చిన ‘హలో’ సినిమాకు ఏకంగా 2లక్షల 10వేల 840 డాలర్ల కలెక్షన్లు (దాదాపు ఒక కోటి 50 లక్షల రూపాయలు) వచ్చాయి. ఈ రెండు సినిమాలతో పోల్చితే.. తాజాగా వచ్చిన ‘మిస్టర్ మజ్ను’ అంతగా కలెక్షన్లు రాబట్టలేకపోవడం గమనార్హం.