agynathavaasi-collections-in-usa

యూఎస్‌లో ‘అజ్ఞాతవాసి’కి ఇంకా ఎంత రావాలంటే..

సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడడం సహజం. పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు కలెక్షన్ల వర్షం కూడా ఖాయం.. దీంతో ఫాలోయింగ్ ఉన్న హీరో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్తంలో రూపుదిద్దుకున్న ‘అజ్ఞాతవాసి’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మొదటిరోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. కానీ సినిమాకు మిశ్రమ స్పందన లభించడంతో రెండవ రోజు నుంచి కలెక్షన్లు ఊహించని రీతిలో తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాలో కలెక్షన్లు భారీగా తగ్గాయి. తెలుగు సినిమా కలెక్షన్లకు కీలకంగా మారిన యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కలెక్షన్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. 

‘అజ్ఞాతవాసి’ సినిమాను ఎల్‌ఏ తెలుగు అనే సంస్థ యూఎస్‌లో డిస్ట్రిబ్యూట్ చేసింది. మొత్తం 20 కోట్ల రూపాయలకు సినిమా హక్కులను కొనుగోలు చేసింది. ప్రచారానికి ఇతరత్రా సుమారు 5 కోట్ల వరకు వెచ్చించింది. అయితే ప్రిమియర్ షోలు, మొదటి రోజు కలెక్షన్ల ద్వారా 1.5 మిలియన్ డాలర్ల కలెక్ట్ చేసిన ‘అజ్ఞాతవాసి’కి రెండవ రోజు నుంచి జోరు తగ్గింది. గురువారం నాటికి మొత్తం 1.73 మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసింది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు దాదాపు 11 కోట్ల రూపాయలను వసూల్ చేసింది. దీంతో ‘అజ్ఞాతవాసి’ లక్ష్యాన్ని చేరుకుంటుందా?..లేదా?.. అనే అంశం ఆసక్తికరంగా మారింది. వీకెండ్ కావడం, పండుగ వాతావరణం ఉండడంతో సినిమాకు కలెక్షన్లు పెరిగితే తప్పా అంచనాలను అందుకునే అవకాశం లేదని సినీ విశ్లేషకులు చెపుతున్నారు.