Agnyaathavaasi-brakes-Attarintiki-Daredhi-record

మహేశ్, ఎన్టీఆర్ సాధించలేకపోయారు. పవన్ మాత్రం..

మహేశ్, ఎన్టీఆర్ సాధించలేని ఓ రికార్డును నాలుగేళ్ల తర్వాత పవన్ అధిగమించాడు. రెండున్నరేళ్లుగా మహేశ్‌, రెండేళ్లుగా ఎన్టీఆర్ ఎంతగా ట్రై చేసినా సాధించలేని రికార్డును.. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత పవన్ చేరుకోగలిగాడు. ఇంతకీ ఆ ముగ్గురికీ అందని ద్రాక్షలా మిగిలిపోయిన ఆ రికార్డు ఏంటని ఆలోచిస్తున్నారా..? వాళ్ల గత సినిమాల హయ్యస్ట్ కలెక్షన్లను దాటడమే ఈ రికార్డు టార్గెట్. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఓవర్సీస్‌లో... ఓవర్సీస్‌లో తమ గత సినిమాల హయ్యస్ట్ గ్రాసర్‌ను దాటేందుకు ఈ ముగ్గురు హీరోలు ఎంతగానో ప్రయత్నించారు. తాజాగా వచ్చిన అజ్ఞాతవాసితో పవన్ ఆ రికార్డును చేరుకోగలిగాడు.

 
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమా.. మహేశ్ కెరీర్లోనే హయ్యస్ట్ ఓవర్సీస్ గ్రాసర్ సినిమాగా నిలిచింది. 2015లో విడుదలయిన ఈ సినిమా.. ఓవర్సీస్‌లో బాహుబలి-2, బాహుబలి-1 తర్వాత మూడో టాప్ గ్రాసర్‌గా నిలిచింది. 2.89 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నారైలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 2016లో వచ్చిన బ్రహ్మోత్సవం, 2017లో వచ్చిన స్పైడర్ సినిమాలు ‘శ్రీమంతుడు’ రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. దీంతో శ్రీమంతుడు రికార్డు ఇంకా అలాగే ఉండిపోయింది.
 
2.02 మిలియన్ డాలర్ల కలెక్షన్లతో సుకుమార్ దర్శకత్వంలో 2016లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా.. ఎన్టీఆర్‌ కెరీర్లోనే హయ్యస్ట్ ఓవర్సీస్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ తర్వాత మహేశ్‌కు బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతాగ్యారేజ్, బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలు హిట్ టాక్‌ను పొందినా.. ఓవర్సీస్‌లో ‘నాన్నకు ప్రేమతో’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయాయి. 
 
ఓవర్సీస్‌లో పవన్ సినిమాల్లో హయ్యస్ట్ కలెక్షన్లను కొల్లగొట్టింది.. అత్తారింటికి దారేది. 2013లో విడుదలయిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే అత్యధిక ఓవర్సీస్ కలెక్షన్లను కొల్లగొట్టి.. పలు రికార్డులను బ్రేక్ చేసింది. మొత్తంగా ఓవర్సీస్ వరకే ఈ సినిమాకు 1.90 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన పవన్ సినిమాలయిన సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాలు ఆశించిన పలితాన్ని ఇవ్వకపోగా.. అత్తారింటికి దారేది రికార్డును బ్రేక్ చేయలేకపోయాయి. తాజాగా విడుదలయిన అజ్ఞాతవాసి ఎట్టకేలకు అత్తారింటికి దారేది రికార్డును బ్రేక్ చేసింది. శనివారం వరకు 1.91 మిలియన్ డాలర్ల కలెక్షన్లను అజ్ఞాతవాసి నమోదు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దీంతో నాలుగేళ్ల తర్వాత పవన్ ఈ రికార్డును దాటినట్లయిందని సినీ అభిమానులు చెప్పుకుంటున్నారు.