:: Welcome to NRI - Article ::

కన్న కూతురికి నరకం చూపిస్తున్న సౌదీ తండ్రి

జెడ్డాహ్: కాలేజీలో ఓ యువకుడికి ముద్దు పెట్టిందని సొంత కూతురికే నరకం చూపించాడో తండ్రి. బ్రిటీష్, సౌదీ దేశాల ద్వంద్వ పౌరసత్వం ఉన్న 21 ఏళ్ల అమీనా అల్ జెఫరీ జెడ్డాహ్‌లోని సౌదీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. అదే యూనివర్శిటీలో చదువుకుంటున్న ఓ అమెరికన్ యువకుడికి బహిరంగంగా ముద్దుపెట్టుకుంది. ఈ విషయం కాస్తా ఆమె తండ్రికి తెలిసింది. దీంతో అమీనాను ఇంట్లోనే బంధించాడు. తన పరిస్థితిని తెలియజేస్తూ బ్రిటన్‌లోని తన స్నేహితురాలికి ఫోటోలు పంపింది. తనను నాలుగేళ్లుగా ఇంటి నుంచి బయటకు రానీయకుండా సొంత తండ్రే నరకం చూపిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నరకం నుంచి తనను రక్షించాలంటూ స్నేహితురాలిని వేడుకుంది. దీంతో లండన్ హైకోర్టులో ఈ విషయమై ఫిర్యాదు చేస్తూ కేసు నమోదు చేసిందామె. గతేడాది వేసవికాలంలో జరిగిందీ ఘటన.

ఈ కేసును విచారించిన న్యాయమూర్తి హోల్మాన్.. అమీనా హక్కులు ప్రమాదంలో పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఆమెకు స్వేచ్ఛను ఇవ్వాలని ఆదేశించారు. అయితే తాను తన కూతుర్ని కాపాడుకునేందుకు ఈ విధంగా చేశానని తండ్రి సమాధానమిచ్చాడు. సౌదీ చట్టాల ప్రకారం.. ఓ మహిళ ఇలా చేయడం అనైతికమని కూడా పేర్కొన్నాడు. అయితే ఆమె బ్రిటన్ పౌరురాలని గుర్తించాలని, అమీనాకు సంబంధించిన వీసా, పాస్‌పోర్ట్‌లను ఆమెకు ఇచ్చేసి లండన్ పంపించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినా.. ఆమె తండ్రి అస్సలు పట్టించుకోలేదు. ఫిబ్రవరి 13న ఈ కేసులో విచారణ జరగాల్సి ఉండగా.. అమీనాను కలిసేందుకు ఆమె లాయర్‌కు సౌదీ అరేబియా వీసా లభించలేదు. తనకు ఇంకా వీసా లభించలేదనీ, అమీనాను కలిసి వివరాలు సేకరించేందుకు గడువు కావాలని లాయర్ కోరడంతో.. ఏప్రిల్ 15కు విచారణను వాయిదా వేశారు. ఈ లోపు అయినా లాయర్‌కు వీసా వస్తుందా...? లేదా..? అన్నదానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఎవరినీ కలవనీయకుండా అమీనాను తండ్రి నిర్భందించినా... తన ఫోన్ ద్వారా అన్ని వివరాలను బయటి ప్రపంచానికి తెలియజేస్తోంది. అమీనా. మరి ఈమెకు విముక్తి లభిస్తుందో.. తండ్రి మాటే నెగ్గుతుందో త్వరలోనే తేలనుంది.

Loading...