world-famous-car-

వరల్డ్ ఫేమస్ కారు.. ఇక చరిత్రలోకి

అమెరికా: ప్రఖ్యాత ‘బీటిల్స్’ కారు ఇక చరిత్ర కానుంది. వచ్చే ఏడాది నుంచి బీటిల్స్ ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్టు ఫోక్స్ వ్యాగన్ ప్రకటించింది. ఎలక్ట్రికల్ కార్లకు డిమాండ్ పెరుగుతుండటంతో కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టు ఫోక్స్ వ్యాగన్ సంస్థ సీఈవో హిన్రిచ్ వోబ్కెన్ తెలిపారు. అమ్మకాలు తగ్గుతుండటం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.

బీటిల్స్‌కి పీపుల్స్ కార్ అనే పేరుంది. ప్రఖ్యాత నియంత హిట్లర్ మానస పుత్రికగా చెబుతుంటారు. జర్మనీని పారిశ్రామికంగా నిలబెట్టడంతో పాటు.. జర్మన్లకు సొంత కారు ఉండాలనే లక్ష్యంతో హిట్లర్ ఈ కార్ల ఉత్పత్తికి ఆదేశించాడంటారు. కార్ల తయారీలో ప్రసిద్ధి చెందిన ఫెర్డినాండ్ పోర్స్చేకి ఈ పనిని అప్పగించాడు. ఫెర్డినాండ్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది. బెంజ్ కారు రూపొందించింది కూడా ఈయనే. మొదట్లో దీనిపేరు ఫోక్స్ వ్యాగనే అయినా.. న్యూయార్క్ టైమ్స్ బీటిల్స్ అంటూ పత్రికల్లో ప్రచురించడంతో ఆ పేరు సార్థకం అయిపోయింది. దీని డిజైన్ 18 ఏళ్ల బేలా బేరిన్యి అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది. 1925లో డిజైన్ చేయగా... 1930లలో కార్ల తయారీ ప్రారంభమైంది. ఆ తర్వాత 1960లలో ‘స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’గా, 1990లలో ‘న్యూ బీటిల్’ పేర్లతో కొత్త మోడళ్లు వచ్చాయి. ‘న్యూ బీటిల్’ 21 మిలియన్లకు పైగా అమ్ముడుపోయి సరికొత్త రికార్డులు సృష్టించింది.