:: Welcome to NRI - Article ::

కళ్ల ముందు రూ.17 లక్షలు.. తిరిగిచ్చేసిన పనోడు

 

దుబాయి: కళ్ల ముందు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 లక్షల రూపాయల నగదు ఉన్న పర్సు. చుట్టూ చూస్తే  ఎవరూ లేరు. ఒక్క క్షణం స్వార్థంతో ఆలోచించి ఉంటే ఆ వ్యక్తి లక్షాదికారి అయి కుటుంబ కష్టాలు అన్నీ తొలగిపోయి ఉండేవి. కానీ తనది కాని రూపాయి తనకు అక్కర్లేదని నిజాయతీగా ఆలోచించి ఆ డబ్బును పోలీసులకు అందజేశాడో వ్యక్తి. యూఏఈలోని షార్జాహ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ఆసియన్ వలసదారుడు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విమానాశ్రయంలోని ఫార్మాలిటీస్ డెస్క్‌ను శుభ్రం చేస్తుండగా ఓ పర్సు కనిపించింది. దాంట్లో ఏకంగా లక్ష దిర్హమ్స్ (దాదాపు 17 లక్షల 41వేల రూపాయలు) ఉన్నాయి. అయితే వెంటనే పర్సును ఉన్నది ఉన్నట్లుగా విమానాశ్రయ పోలీసులకు అప్పగించాడా వ్యక్తి. పర్సును చూసి అందులో ఉన్న కార్డులను బట్టి ఎవరిదో గుర్తించారు. అతడిని రప్పించి ఆ పర్సును అధికారులు ఇప్పించారు. మొత్తానికి ఏ మాత్రం ఆశకు పోకుండా నిజాయతీగా వ్యవహరించిన ఆసియన్ కార్మికుడిని షార్జాహ్ విమానాశ్రయ డిప్యూటీ డైరెక్టర్ మాట్టర్ అల్ కెట్బీ అభినందించారు. తమ పని వాళ్లలో ఎంత నిజాయతీ ఉందనేదానికి ఇదొక నిదర్శనమన్నారాయన. ఆసియన్ కార్మికుడిని సత్కరించి కొంత నగదు బహుమతిని కూడా ఇచ్చారు. మొత్తానికి నిజాయతీగా మారుపేరుగా నిలిచిన కార్మికుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.