Woman-receives-forged-visas-on-WhatsApp

దొంగ వీసాలతో 8లక్షలు దోచుకున్నారు..!

దుబాయి: ఓ పర్యాటకురాలిని దుబాయిలో ఓ నేపాలీ యువతి దారుణంగా మోసంచేసింది. వర్కింగ్ వీసాల కోసం 42000దీనార్లు (రూ.8లక్షలకు పైగా) సొమ్ము చెల్లిస్తే.. దొంగ పర్మిట్లతో ఆమెను ముంచేసింది. ‘గతేడాది నేను దుబాయి వచ్చినపుడు ఆ యువతి నాకు పరిచయమైంది. తన స్నేహితుడి కంపెనీ నుంచి వర్కింగ్ వీసాలిప్పిస్తానని చెప్పింది. దానికోసం రూ.8లక్షలు ఖర్చవుతుందని చెప్పడంతో నేను సగం సొమ్ము చెల్లించి స్వదేశం తిరిగి వెళ్లాను. మిగతా సొమ్ము తర్వాత ఇస్తానని చెప్పాను. కొన్ని రోజుల తర్వాత నాకు వాట్సాప్ ద్వారా వీసాలు పంపించిందామె. దాంతో నేను మిగతా సొమ్ము కూడా చెల్లించాను. ఆ తర్వాత నేను ఫోన్‌ చేసినా, మెసేజ్ చేసినా ఆమె స్పందించలేదు. నాకు అనుమానం వచ్చింది. తెలిసిన ఓ టూరిజం సంస్థకు ఆ పర్మిట్లు చూపించాను. నా అనుమానం నిజమైంది. అవి నకిలీవని తెలిసింది. మేలో దుబాయి మళ్లీ వచ్చాను. ఆమెను పట్టుకున్నాను. అయితే అవి నిజమైన వీసాలేనని, తన స్నేహితుడి కంపెనీ నుంచి ఇప్పించానని ఆమె బుకాయించింది’ అని బాధితురాలు తెలిపింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె వద్ద ఉన్న వీసాలను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని తేల్చారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని, ఆమె సహచరుడి కోసం వెదుకుతున్నారు. కేసు విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది.