when-women-bathing-

స్నానం చేస్తుండగా వీడియో.. హోటల్‌పై కోర్టుకెక్కిన మహిళ

చికాగో: తాను షవర్ కింద స్నానం చేస్తుండగా రహస్య కెమెరా ద్వారా వీడియో తీసి దానిని వివిధ పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేసిన హోటల్‌పై చికాగోకు చెందిన మహిళ 100 మిలియన్ డాలర్లకు కేసు వేసింది. హోటల్ తీరు తనను తీవ్ర మానసిక వ్యధకు గురిచేసిందని, తన ప్రతిష్ఠను దెబ్బ తీసిందని ఆరోపిస్తూ ‘హిల్టన్ వరల్డ్ వైడ్’ అనే సంస్థపై బాధిత మహిళ కోర్టులో దావా వేసింది. జూలై 2015లో బార్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన మహిళ న్యూయార్క్ రాష్ట్ర రాజధాని అయిన అల్బనీలోని ‘హాంప్టన్ ఇన్ అండ్ సూట్స్’ హోటల్‌లో దిగింది. హోటల్ బాత్రూంలో ఆమె స్నానం చేస్తుండగా అందులో అమర్చిన రహస్య కెమెరా ద్వారా ఓ సిబ్బంది ఆమెను చిత్రీకరించాడు. అయితే, తనను అలా చిత్రీకరించినట్టు ఆమెకు తెలియదు.

ఈ ఏడాది సెప్టెంబరులో అంటే.. ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత ఆమెకు ఓ ఈమెయిల్ వచ్చింది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే అది ఓ పోర్న్ సైట్‌కు వెళ్లింది. అందులో ఆమె హోటల్‌లో షవర్ కింద నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో ఉంది. తన పూర్తి పేరుతో ఆ వీడియో అప్‌లోడ్ కావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అంతేకాదు, తనకు ఈమెయిల్ పంపిన వ్యక్తి తనను తాను కామాంధుడిగా పేర్కొంటూ పలుమార్లు ఈమెయిల్స్ పంపి బెదిరించాడు. అంతేకాదు, మరిన్ని పోర్న్ సైట్లలోనూ ఆమె వీడియోను అప్‌లోడ్ చేస్తానని హెచ్చరించాడు. ఆమె స్నేహితులు, మాజీ క్లాస్‌మేట్లు, సహచరులకు ఆమె పేరుతో నకిలీ ఈమెయిల్ అడ్రస్‌ సృష్టించి ఆ వీడియోను పంపించాడు. ఆ తర్వాత ఆమెకు మరో ఈమెయిల్ పంపిస్తూ 2 వేల డాలర్లు అడిగాడు. దీంతోపాటు నెలకు వెయ్యి డాలర్ల చొప్పున ఏడాది పాటు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే మరిన్ని పోర్న్ సైట్లలో వీడియోను అప్‌లోడ్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఆమె నేరుగా కోర్టులో ఫిర్యాదు చేసింది. తాను దిగిన హోటల్‌ను నిర్వహిస్తున్న ‘హిల్టన్ వరల్డ్‌వైడ్’పై 100 మిలియన్ డాలర్లకు కేసు వేసింది. ఆమె కేసు వేయడంతో స్పందించిన హోటల్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ కేసుతో తాము షాక్‌కు గురైనట్టు చెప్పారు. తమ హోటల్‌లో ఎటువంటి రహస్య కెమెరాలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.