:: Welcome to NRI - Article ::

వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారా?..అయితే మీకో హెచ్చరిక

దుబాయ్: సోషల్ మీడియాలో ఏదోవిధమైన నేరాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. హ్యాకింగ్, ఫేక్‌ అకౌంట్లతో వేధింపులు వంటి నేరాలకు సంబంధించిన కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై పోలీసులు ఓ హెచ్చరికను జారీ చేశారు. సోషల్ మీడియా ఉపయోగించేవారు తమ సెల్‌ఫోన్లను వేరే వ్యక్తుల చేతికి ఇవ్వకుండా జాగ్రత్త పడాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూఏఈలోని దుబాయ్ నగరంలో జరిగిన ఓ ఘటన పోలీసుల హెచ్చరికకు కారణం అయింది. తన వాట్సాప్ అకౌంట్‌ను ఎవరో హ్యాకింగ్ చేస్తున్నారని, తన సంభాషణ, వ్యక్తిగత ఫోటోలను దొంగిలిస్తున్నారని దుబాయ్ నగరానికి చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘నీ సెల్‌ఫోన్‌ను ఎవరికైనా ఇచ్చావా?’ అని పోలీసులు యువతిని ప్రశ్నించారు. అప్పుడెపుడో ఓ విద్యార్థికి ఇచ్చానని, అతడెవరో తనకు తెలియదని సెల్‌ఫోన్‌ను ఉపయోగించాడని చెప్పింది. దీంతో సెల్‌ఫోన్ ఉపయోగించిన ఆ విద్యార్థే హ్యాక్ చేస్తున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు విచారణ జరుపుతున్నామని దుబాయ్ సైబర్ పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా సెల్‌ఫోన్‌ను వేరే వ్యక్తులకు ఇస్తే సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయడం సులభమేనని, ఇలాంటి కేసులు అనేకం నమోదవుతున్నాయని, జాగ్రతగా ఉండాలంటూ వాట్సాప్, సోషల్ మీడియా వినియోగదారులను అధికారులు హెచ్చరిస్తున్నారు.

Loading...