Visa-fraud-in-Hyderabad

వీసాల పేరిట మోసాలు

ఇద్దరు నకిలీ ట్రావెల్‌ ఏజెంట్ల అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతున్న ఇద్దరు నకిలీ ట్రావెల్‌ ఏజెంట్లను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన గమ్లూరి అమానుల్లా (27) కార్పెంటర్‌గా పని చేస్తుంటాడు. వచ్చే ఆదాయం సరిపోక అక్రమ ఆదాయానికి తెరలేపాడు. గతంలో అరబ్‌ దేశాల్లో పని చేసిన అనుభవమున్న అమానుల్లా, అదే జిల్లాకు చెందిన తన మిత్రుడు మహమ్మద్‌ గౌస్‌ (29)తో కలిసి ప్లాన్‌ వేశాడు. ఇద్దరూ కలిసి విదేశీ ఉద్యోగాల పేరిట అక్రమంగా అమాయకులను గల్ఫ్‌ దేశాలకు పంపేందుకు పథకం రచించారు. హైదరాబాద్‌తో పాటు ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఉన్న సబ్‌ ఏజెంట్లకు కమీషన్లు ఇస్తామని నమ్మించి అమాయకులను టార్గెట్‌ చేశారు. వారికి మంచి జీతాలపై గల్ఫ్‌లో క్లీనింగ్‌, లేబర్‌, కార్పెంటర్‌ ఉద్యోగాలిప్పిస్తామని మాయమాటలు చెప్పి వారి వద్ద నుంచి రూ. 85 వేల నుంచి రూ. లక్ష వరకు డిమాండ్‌ చేసి వసూలు చేయశాగారు. వీరు హైదారాబద్‌లోని లక్డీకాపుల్‌లోని ఓ హోటల్‌ను అడ్డాగా చేసుకుని ట్రావెల్‌ ఏజెంట్ల అవతారమెత్తారు. విదేశాలకు వెళ్లాలనే నిరుద్యోగులను హోటల్‌కు రప్పించుకుని ఇంటర్వ్యూలు నిర్వహించి, వారి నుంచి పాస్‌పోర్టు, డబ్బులను తీసుకునేవారు. 

అనంతరం వారికి  మహబూబ్‌ షరీఫ్‌, మహబూబ్‌ ఖాన్‌ అనే వ్యక్తుల సాయంతో జాబ్‌ వీసా కాకుండా విజిట్‌ వీసా, ఎయిర్‌ టికెట్‌లు సమకూర్చి పంపించేవారు. ఉద్యోగ వీసా అని చెప్పి విజిట్‌ వీసాలపై విదేశాలకు పంపిస్తూ యువకులను మోసం చేస్తున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు హోటల్‌ విష్ణు, రూమ్‌ నెంబర్‌ 150లో దాడి చేసి అమానుల్లా, మహబూబ్‌ అనే ఇద్దరు నిందితులను  అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 5 పాస్‌పోర్టులు, 3 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.