Vijaymallya-proposal-

ప్లీజ్‌.. అసలు చెల్లిస్తా

దయచేసి ఒప్పుకోండి: మాల్యా
లండన్‌: లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు అప్పగింత భయం పట్టుకుంది. దీంతో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.5,500 కోట్ల ‘అసలు’ మొత్తాన్ని చెల్లిస్తా, దయ చేసి ఒప్పుకోండని ట్వీట్ల మీద ట్వీట్లు ప్రారంభించారు. ‘నా అప్పగింత నిర్ణయంపై మీడియా ఎప్పటికప్పుడు ఏదో రాస్తోంది. అయితే అది వేరే విషయం. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుంది. ఇక్కడ అత్యంత ప్రధాన విషయం, నేను బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకున్న ప్రజల సొమ్ము. వడ్డీ లేకుండా ఆ అసలు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. నా ఆఫర్‌ను మన్నించాలని ప్రభుత్వం, బ్యాంకులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని మాల్యా తాజాగా ట్వీట్‌ చేశారు.
 
అగస్టావెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల ముడుపుల కుంభకోణం కేసులో, యునైటెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) ప్రభుత్వం, క్రిస్టియన్‌ మైఖేల్‌ను భారత ప్రభుత్వానికి అప్పగించిన మరుసటి రోజే మాల్యా ఈ ట్వీట్లు చేయడం విశేషం. ఆర్థిక నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద మాల్యాను అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఈ నెల 10న తుది నిర్ణయం తీసుకోబోతోంది. దీంతో కోర్టు నిర్ణయం వెలువడే లోపే ప్రభుత్వంతో ఏదోలా రాజీ చేసుకోవాలని మాల్యా భావిస్తున్నట్టు సమాచారం.
 
వడ్డీతో కలిసి రూ.9,000 కోట్లు
వడ్డీలతో కలుపుకుంటే భారత బ్యాంకులకు మాల్యా చెల్లించాల్సిన మొత్తం రూ.9,000 కోట్ల వరకు ఉంటుంది. అసలు మాత్రమే చెల్లిస్తానని మాల్యా గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టుకు ఈ మేరకు సెటిల్‌మెంట్‌ ఆఫర్‌ కూడా మాల్యా సమర్పించారు. అయితే వడ్డీతో సహా చెల్లించే ఆర్థిక స్థోమత ఉన్నా మాల్యా కావాలనే నాటకాలు ఆడుతున్నారనే కారణంతో బ్యాంకులు ఆ ఆఫర్‌ను తిరస్కరించాయి. మోసపూరితంగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో తీసుకున్న రుణాలను, మాల్యా అక్రమంగా దేశ సరిహద్దులు దాటించినట్టు ఇప్పటికే ఈడీతో సహా పలు దర్యాప్తు సంస్థలు తేల్చాయి. దీంతో ఈ ‘అసలు’ ఆఫర్‌కు బ్యాంకులు ఇపుడు కూడా ఒప్పుకోక పోవచ్చని భావిస్తున్నారు.
 
తప్పంతా ‘చమురు’దే
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూసివేతలో తన తప్పేంలేదని మాల్యా మరోసారి చెప్పుకొచ్చారు. అప్పట్లో పీపా చమురు ధర 140 డాలర్లకు చేరడంతో నిర్వహణ ఖర్చులు, నష్టాలు పెరిగి పోయి కంపెనీని మూసేయాల్సి వచ్చిందని ట్వీట్‌ చేశారు. విమానయాన సంస్థల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. విమాన ఇంధన ధరలు అధికంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. ‘నేను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్‌ను నడిపేటప్పుడు పీపా చమురు ధర 140 డాలర్ల వరకు పెరిగింది. దాంతో నష్టాలు పెరిగి బ్యాంకుల అప్పులు చెల్లించలేకపోయా. ఆ అప్పులకు సంబంధించి అసలు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. దయచేసి నా ఆఫర్‌ను స్వీకరించండి’ అని ట్వీట్‌ చేశారు.