:: Welcome to NRI - Article ::

విదేశాల్లోనూ ఉపాధి లభించాలి: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని యువతకు స్థానిక పరిశ్రమలతోపాటు విదేశాల్లోనూ ఉద్యోగావకాశాలు లభించేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలని హోం, కార్మిక, ఉపాధి కల్పన  మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మిషన్‌కు సంబంధించిన ముసాయిదా రూపకల్పనపై చర్చించేందుకు శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మంత్రులు, అధికారులతో తొలిసారి ఈ సమావేశం నిర్వహించారు. విదేశాల్లో డిమాండ్‌ ఉన్న రంగాలను గుర్తించి ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు శిక్షణనిచ్చేలా ముసాయిదా విధానాన్ని రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి కూడా నిధులు పొందే ప్రయత్నం చేద్దామన్నారు. ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పనిచేయగల వారిలో నైపుణ్యాన్ని పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు మాట్లాడుతూ.. ముసాయిదా పాలసీపై త్వరలోనే సీఐఐతో సమావేశమవుతామన్నారు. నైపుణ్య శిక్షణను తొలుత పైలట్‌ పద్ధతిలో చేపట్టాలని, తదనంతరం విస్తరించాలని మునిసిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్‌ సూచించారు. రాష్ట్రంలో 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు 2.2 కోట్ల మంది ఉన్నారని, అందులో 1.51 కోట్ల మంది పని కోరుకుంటున్నారని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య పేర్కొన్నారు. సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సాంకేతిక శాఖ డైరెక్టర్‌ వాణీప్రసాద్‌, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్‌, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నీతూప్రసాద్‌, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ డీజీ, తెలంగాణ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ (టాస్క్‌) సీఈవో తదితర అధికారులు పాల్గొన్నారు. 

 

Loading...