US-sensational-decision-about-pursuing-action-against-Sentinelese-tribe

మూడు నెలల క్రితం భారత్‌లో సెంటినెలీస్ తెగ చేతిలో హత్యకు గురైన అమెరికన్ విషయంలో ట్రంప్ సర్యారు కీలక నిర్ణయం

వాషింగ్టన్: మూడు నెలల క్రితం అమెరికన్ మత ప్రచారకుడిని హత్య చేసిన అండమాన్ దీవుల్లోని సెంటినెలీస్ తెగపై ఎటువంటి చర్యలకూ తాము డిమాండ్ చేయడంలేదని అమెరికా ప్రకటించింది. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ ఘటనలో సెంటినెలీస్‌కు క్రిస్టియానిటీని పరిచయం చేయాలనే ఉద్దేశంతో అక్కడకు వెళ్లిన జాన్ అలెన్ చౌ అనే అమెరికన్‌ను ఆ తెగవారు నిర్దాక్షిణ్యంగా బాణాలతో కొట్టి చంపేశారు. అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ప్రభుత్వ బలగాలు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఈ విషయంలో సెంటినెలీస్ తెగపై చర్యలుతీసుకోవాలని తాము భారత్‌పై ఒత్తిడి చేయబోవడం లేదని అమెరికాలోని లార్జ్ ఫర్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అంబాసిడర్ శామ్యూల్ బ్రౌన్‌బాక్ ప్రకటించారు. ఈ ఘటనలో జాన్‌ను దీవిలో దింపడానికి వెళ్లిన వారు అక్కడ జరిగిన దారుణాన్ని ప్రత్యక్షంగా చూశారు. దాన్ని ప్రపంచానికి వెల్లడించారు. అలబామాకు చెందిన జాన్, క్రిస్టియన్ మతాన్ని సెంటినెలీస్ తెగకు పరిచయం చేయడానికే సెంటినెలీస్ దీవికి వెళ్తున్నట్లు చెప్పాడు. అక్కడకు వెళ్లేముందు కుటుంబసభ్యులకు ఓ మెసేజ్ పెట్టాడు. ఆ దీవిలోని వారికి జీసస్‌ను పరిచయం చేసేందుకు వెళ్తున్నానని, ఒకవేళ ఈ ప్రయత్నంలో తాను మరణించినా కూడా ఆ దీవిలోని వారిపై కోపం తెచ్చుకోవద్దని కోరాడు. దీనిపై శామ్యూల్ చేసిన తాజా ప్రకటనలో.. జాన్‌ను చంపిన సెంటినెలీస్ తెగపై తమకు ఎటువంటి ఆగ్రహమూ లేదని, వారిపై చర్యలకు తాము డిమాండ్ చేయబోవడం లేదని వెల్లడించారు. అతని మృతదేహాన్ని వెనక్కి తీసుకురావడం కూడా కష్టమేనని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో భారత్‌పై ఎటువంటి ఒత్తిడీ తీసుకురావడం లేదని స్పష్టం చేశారు.