US-pushes-motion-to-put-Pakistan-on-global-terrorist-financing-watchlist

పాక్‌కు షాకివ్వనున్న అమెరికా..వెల్లడించిన సీనియర్ అధికారి

వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఉగ్రవాద నిరోధంలో సహకరించని పాకిస్తాన్‌కు సహాయక నిధులు విడుదల చేయబోమని గతంలోనే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలకమైన చర్యకు సిద్ధమయ్యారు. పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకివ్వాలని అమెరికా భావిస్తోంది. అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేస్తున్న దేశాల జాబితాలో పాకిస్తాన్‌ పేరును చేర్చాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారని పాకిస్తాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. యాంటీ మనీ మనీలాండరింగ్ మానిటరింగ్ గ్రూపుల ద్వారా ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేస్తున్నారని అమెరికా పేర్కొంటోందని ఆయన అన్నారు. ఇదిలావుండగా అమెరికా వద్ద నిధులు పొందాలని పాకిస్తాన్ తీవ్రమైన ప్రయత్నాలు చేస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్‌పై నిందలు మోపుతోంది. కానీ ఉగ్రవాద నిరోధానికి సహకరించని పాకిస్తాన్‌కు ఆర్థిక సహాయం చేయకూడదని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఈమేరకు మరికొన్ని చర్యలు తీసుకోనుంది.