us-police-uncover-tollywood-sex-racket

అమెరికాలో బయటపడ్డ సెక్స్ రాకెట్..టాలీవుడ్‌తో లింకులు

చికాగో, యూఎస్‌ఏ: అమెరికా కేంద్రంగా టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు తెరవెనుక సాగిస్తున్న చీకటి బాగోతం వెలుగులోకి వచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు వర్ధమాన హీరోయిన్లు, యాంకర్లతో.. ఓ వ్యాపారవేత్త, పలు హిట్ సినిమాల కోప్రొడ్యూసర్ కిషన్ మొదుగుమూడి(34) అలియాస్ రాజు అలియాస్ శ్రీరాజ్ చొన్నుపాటి దంపతులు అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని చికాగో పోలీసులు బయటపెట్టారు. వ్యభిచారంతోపాటు సెక్స్ వర్క్‌కు సంబంధించిన ప్రచారం కూడా నిర్వహిస్తున్నారని, అమెరికాలోని పలు ప్రదేశాల్లో ఈ నిర్వాకానికి పాల్పడ్డారని తేలింది. చికాగోలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో 42 పేజీలతో దాఖలైన ఫెడరల్ చార్జెస్ విషయాన్ని ‘చికాగో ట్రిబున్’ అనే వార్త సంస్థ ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

కిషన్ మొదుగుమూడి, ఆయన భార్య చంద్ర సంయుక్తంగా ఈ సెక్స్ రాకెట్‌ను నడిపించారని దర్యాప్తులో తేలింది. నిందితులిద్దరినీ ఏప్రిల్‌లో అదుపులోకి తీసుకున్నారని, బెయిల్ పొందడం ఇద్దరికీ సాధ్యపడలేదని పత్రిక పేర్కొంది. చిన్న పాత్రలు చేసిన ఓ నటికి అమెరికాలో మంచి ఉపాధి కల్పిస్తామంటూ నమ్మబలికి తీసుకెళ్లిన ఈ దంపతులు వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు. తనకు ఎలాంటి హాని తలపెట్టవద్దంటూ సదరు నటి వారికి విన్నవించింది. ఈమేరకు నిందితులకు మెయిల్ పంపడంతో వ్యవహారం చికాగో పోలీసుల దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన యూఎస్ పోలీసులు దర్యాప్తులో వివరాలన్నీ రాబట్టారు. తనకు హాని కలిగించడవద్దని పేర్కొన్న సదరు నటిని ప్రధాన బాధితురాలిగా ఫెడరల్ చార్జెస్‌లో పేర్కొన్నారు. మరో నలుగురు నటులు బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు.
 
ఈ సెక్సు రాకెట్‌లో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని దర్యాప్తులో స్పష్టమైంది. అమెరికాలోని ప్రవాసి సంఘాలు నిర్వహించే కార్యక్రమాల పేరుతో తాత్కాలిక వీసాలు ఇప్పించి అక్కడి హోటళ్లలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించేవారని విచారణలో తేలింది. భారతీయ ప్రవాసీ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలకు విచ్చేసే వ్యక్తులే లక్ష్యంగా వారి వద్ద 3 వేల డాలర్లు వసూలు చేసి వ్యభిచారం నిర్వహించేవారు. బాధితులు ఏవిధంగా శృంగారంలో పాల్గొంటారనే దాన్ని బట్టి డబ్బులు వసూలు చేసేవారని తేలింది. నిందిత దంపతుల నివాసంలో తనిఖీ నిర్వహించగా 70కి పైగా కండోమ్‌లు లభించాయి. ఈ కేసుపై కోర్టులో విచారణ అనంతరం మరిన్ని విషయాలను బయటపెట్టనున్నామని యూఎస్ పోలీసులు తెలిపారు.