US-based-Techi-marries-gay-partner-in-Maharashtra

అమెరికాలో భారతీయ టెకీ.. మరో అబ్బాయిని ప్రేమించి..

 

ముంబాయి: ఓ స్టార్ హోటల్. అందులో ఓ ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్‌లో సెల్‌ఫోన్లకు కూడా అనుమతి లేదు. అంత్యంత రహస్యంగా ఆ హోటల్‌లో జరిగింది ఓ పెళ్లి. అదేంటి పెళ్లిని అంత రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమిటని మీ అనుమానమా..? అది మామూలుగా ఓ అమ్మాయికి, అబ్బాయికి జరిగిన పెళ్లి కాదు.. ఇద్దరు అబ్బాయిలకు జరిగిన వివాహం. ఇది ఏ అమెరికాలోనో, ఇతర దేశాల్లోనో జరిగిందనుకుంటే పొరపాటే. భారత్‌లో మహారాష్ట్ర రాజధాని ముంబాయికి 670 కిలోమీటర్ల దూరంలో ఉన్న యవట్మల్ అనే నగరంలో గతేడాది డిసెంబర్ 30న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్లకు కూడా అనుమతిలేని ఈ పెళ్లి వేడుకలో.. ఎలా వచ్చిందో కానీ.. ఓ ఫొటో ఒకటి మాత్రం బయటకు పొక్కి.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
యవట్మల్‌కు చెందిన 40 ఏళ్ల హ్రిషీ మోహన్‌కుమార్ సాథ్‌వానే అమెరికాలోని కాలిఫోర్నియాలోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పరిచయం అయిన వియాత్నాంకు చెందిన విన్హ్ అనే యువకుడితో ప్రేమలో పడ్డాడు. ఐఐటీ బాంబేలో బీటెక్ పూర్తి చేసిన మోహన్‌కు అమెరికాలో గ్రీన్‌కార్డు కూడా ఉంది. ఇద్దరూ కొన్నాళ్లపాటు సహజీవనం చేశారు. మొత్తానికి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికొచ్చారు. తమ నిర్ణయాన్ని వారివారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట్లో కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపినా.. ఎట్టకేలకు వారిని ఒప్పించారు. గతేడాది జూన్ నెలలో సాంప్రదాయ బద్ధంగా వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత డిసెంబర్ 30వ తారీఖున అత్యంత రహస్యంగా వీరిద్దరి పెళ్లి శాస్త్రబద్ధంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రాణమిత్రులు మాత్రమే హాజరయిన ఈ పెళ్లికి సంబంధించిన ఓ ఫొటో అనుకోకుండా బయటకొచ్చింది.  ఈ సంఘటనపై విచారణ చేస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.