UNO-released-deepavali-stamps

ఐక్య రాజ్య సమితి దీపావళి తపాలా బిళ్లలు

న్యూయార్క్ : కోట్లాది మంది ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపావళికి ఐక్య రాజ్య సమితి (ఐరాస) ప్రత్యేక గుర్తింపు లభించింది. దీపావళి పండుగను స్మరించుకుంటూ గత నెల 19న ఐరాస పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐరాసకు భారత ప్రభుత్వం ధన్యవాదాలు తెలిపింది.

ఐరాసకు భారతదేశ శాశ్వత ప్రతినిథి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఐరాసలో ప్రతి రోజూ మంచి, చెడుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుందని, పవిత్రమైన దీపాల పండుగ సందర్భంగా తొలి సముదాయపు దీపావళి తపాలా బిళ్లల్లో చెడుపై మంచి విజయం సాధించాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని చిత్రించినందుకు  యూఎన్‌స్టాంప్స్‌కు ధన్యవాదాల అని పేర్కొన్నారు. 
 
ఐరాస తపాలా విభాగం విడుదల చేసిన దీపావళి స్టాంపులపై దీపాలను చిత్రించారు. దీపం నేపథ్యంలో దీపాలతో అలంకరించిన ఐరాస ప్రధాన కార్యాలయం భవనం వెలుగులు విరజిమ్ముతోంది. హ్యాపీ దివాలీ అని ఆంగ్లంలో రాసి ఉంది.
 
ఐక్యరాజ్య సమితి తపాలా విభాగం ఈ స్టాంపుల గురించి వివరిస్తూ ‘‘దివాలీ, దీనిని దీపావళి అని కూడా పిలుస్తారు. ఇది ఆనందకరమైన, ప్రజాదరణగల దీపాల పండుగ. దీనిని భారతదేశంలో జరుపుకుంటారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక మత విశ్వాసాలను అనుసరించేవారు కూడా దీపావళిని జరుపుకుంటారు’’ అని పేర్కొంది. మట్టి ప్రమిదలలో దీపాలను పెట్టి ఈ పండుగ చేసుకుంటారని పేర్కొంది. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దీపావళిని జరుపుకుంటారని వివరించింది. చాలామంది దీనిని నూతన సంవత్సర ప్రారంభ దినంగా జరుపుకుంటారని తెలిపింది.