ugadi-and-sriramanavami-celebrations-by-TAGB

టీఏజీబీ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

బోస్టన్, యూఎస్‌ఏ: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14, 2018న ఉగాది, శ్రీరామనవమి వేడుకలు సందడి జరిగాయి. నార్త్ బరో అల్గాన్ క్విన్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో సుమారు వెయ్యికి పైగా సభ్యులు పాల్గొన్నారు. పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితం మార్చేందుకు టీఏజీబీ కార్యవర్గ సభ్యులు ప్రేక్షకులకు కొన్ని ఆహ్లాదకరమైన కార్యక్రమాలను నిర్వహించి అలరించారు. కార్యక్రమ ప్రాంగణం, పాఠశాల ప్రవేశద్వారం, వేదికను సంప్రదాయ ఉత్సవ ఆకృతిలో టీఏజీబీ అలంకరణ బృందం తీర్చిదిద్దింది. ఉగాది పచ్చడి - పానకంతో సహా సంప్రదాయన్ని అడుగడుగునా ప్రతిబింపజేసే ఎన్నో అనుభూతులు ఆహుతులకు అందించారు.
 
క్వాలిటీ మేట్రిక్స్‌‌కు చెందిన ప్రియాంక వల్లేపల్లి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ప్రసాద్ ఆనెం దంపతులు, దేశీ ప్రైం రియాలిటీ అధినేతలు కిరణ్ గుండవరపు తదితరులు కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. కిరణ్ గుండవరపు దంపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అధ్యక్షురాలు  మణిమాల చలుపాది స్వాగత పలుకులతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక గానామృతాలు, శ్లోకాలు, డాన్సుల సందడి, శాస్త్రీయ సంగీతము మరియు శాస్త్రీయ నృత్య ప్రదర్శనలతో పాటు, కళ్యాణ్ కట్టమూరి కితకితలు  కామెడి కడుపుబ్బ నవ్వించింది.
 
కుమారి మహిమ సిలప్పగారి పల్లెల అందాలను చక్కగా వివరించే పాటలు పాడి అందరిని అలరించారు. ఫణి డొక్కా ఉత్తిత్తి అవధానం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అవధాన ప్రక్రియ సరళంగా ప్రేక్షకులకి అర్థమయ్యేలా హాయిగా సాగిపోయింది. రమణ దుగ్గరాజు దుశ్శలువాతో కప్పగా పద్మ పరకాల పుష్ప గుచ్చం ఇచ్చారు. శ్రీనివాస్ కాకి జ్ఞాపిక ఇచ్చి టీఏజీబీ తరపున సత్కరించారు. చిన్నారులు, పెద్దలు ఉత్సాహంతో చేసిన వినూత్న కార్యక్రమాలు ప్రేక్షకుల ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి. బాలలహరి ఆధ్వర్యంలో పద్మజ బాల, శ్రీనివాస్ బాల దర్శకత్వంలో భక్త ప్రహ్లాద నృత్య నాటిక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంస్కృతి, సంబరాలకు ప్రతిబింబిస్తూ కార్యక్రమాలకు వన్నె తెచ్చింది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని అందించిన పద్మజ బాలాని, సుబ్బు కోట, ప్రకాష్ రెడ్డిని టీఏజీబీ తరపున సన్మానించారు. దాదాపు 9 గంటలపాటు నిర్విరామంగా సాగిన నాటి కార్యక్రమంలో 45కి పైగా ప్రదర్శనలతో కళాకారులు ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. కార్యవర్గ సభ్యులు సీతారామ్ అమరవాది, రమణ దుగ్గరాజు, పద్మజ బాల, రామకృష్ణ పెనుమర్తి, సత్య పరకాల మరియు దీప్తి గోరా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమాలు విజయవంతమవ్వడంతో కీలకపాత్ర పోషించారు. ఎంతోమంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు, గురువులు, అలాగే ఎందరో స్వచ్ఛంద సేవకులు, టీఏజీబీ కమిటీ సభ్యులు నిర్విరామ శ్రమ వల్ల కార్యక్రమం విజయవంతమైంది. వివిధ కళలను ప్రదర్శించిన వారికి పద్యాల పోటీలో గెలిచిన వారికి టీఏజీబీ కమిటీ వారు ప్రత్యేకాభినందలు తెలియజేశారు. చిన్నారుల ప్రజ్ఞాపాటవాలకి పదును పెట్టే పద్యాల పోటీ పోటాపోటీగా ఉత్సాహంగా గడిచింది. టీఏజీబీ ఆధ్వర్యంలో మొట్టమొదటి సారి ఏర్పాటు చేసిన చారిటీ టీంకు విశేష ఆదరణ లభించింది. ఈ బుధవారం, ఏప్రిల్ 18న లోవెల్ సూప్ కిచెన్లో కూడా టీఏజీబీ సామాజిక సేవా కార్యక్రమంతో ఉత్సాహం నింపబోతోంది.
 
గ్రీన్ టీం తరపున మొదటిసారిగా చలివేంద్రాలు ఏర్పాటుతో ‘ప్లాస్టిక్ బాటిల్స్’ వాడకాన్ని విశేషంగా తగ్గించారు. సాయంత్ర ప్రదర్శనలతోపాటు ఆవరణలో పెట్టిన అంగడులు కూడా వచ్చినవారిని ఆకట్టుకున్నాయి. సాయంత్రం మినర్వా రెస్టరాంట్ వారు విచ్చేసిన ఆహుతులకు చక్కని రుచికరమైన భోజనం అందించారు. బోస్టన్ పరిసర ప్రాంతాలలో విశేష సాంఘిక సేవ చేసినందుకు మాధవి దోనేపూడిను టీఏజీబీ సత్కరించింది. డాక్టర్ హరిబాబు ముద్దన, బాబురావు పోలవరపు పుష్ప గుచ్చం ఇచ్చి సాయిరాణి, డాక్టర్ అమ్మణిలను దుశ్శలువా కప్పగా మోహన్ నన్నపనేని, శశికాంత్ వల్లేపల్లి జ్ఞాపికను ఇచ్చి టీఏజీబీ తరపున గౌరవించారు. శశికంత్ వల్లేపల్లి బీఓటి సభ్యుల తరపున అందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతోమంది కృషిని, సమయాన్ని వెచ్చించి వేడుకలను విజయవంతం చేసిన ప్రదర్శకులు, వారి తల్లితండ్రులు, విచ్చేసిన ప్రేక్షకులు, వాలంటీర్లు, టీఏజీబీ కార్యవర్గ సభ్యులు మరియు దాతలకు టీఏజీబీ  ప్రెసిడెంట్ మణిమాల చలుపాది ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి టీఏజీబీ సాంస్కృతిక వర్గ సభ్యులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తమ చక్కని తెలుగు వాక్చాతుర్యంతో వచ్చిన ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. చివరిగా టీఏజీబీ సెక్రటరీ రమణ దుగ్గరాజు ప్రదర్శకులు, వాలంటీర్లలు, టీఏజీబీ కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత జాతీయ గీతం పాడటంతో నాటి వేడుకలు విజయవంతంగా ముగిశాయని నిర్వాహకులు టీఏజీబీ సభ్యులు తెలిపారు.