TV-director-jailed-for-threatening-ex-lover-with-morphed-pics

టీవీ డైరెక్టర్‌కు జైలుశిక్ష..కారణం ఇదే..

దుబాయ్: వారిద్దరూ మాజీ ప్రేమకులు.. తీవ్రమైన ఘర్షణల కారణంగా ఇద్దరూ విడిపోయారు. దాదాపు మూడు సంవత్సరాలు గడిచిపోయింది. మహిళ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తల్లి కూడా అయ్యింది. ఆమెపై పగ పెంచుకున్నమాజీ ప్రియుడు ఓ టీవీ చానల్‌ల్లో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. తన మాజీ ప్రేయసిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. 

ఇద్దరూ కలిసి గతంలో దిగిన ఫోటోలను ఆయుధంగా వాడుకోవాలనుకున్నాడు. ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేశాడు. ఈ ఫోటోలకు తోడు బాధిత మహిళ ఫేస్‌బుక్ అకౌంట్‌ను హ్యాక్ చేసి మరికొన్ని వ్యక్తిగత ఫోటోలను కూడా మార్ఫింగ్ చేశాడు. దాదాపు మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. ఈ ఫోటోలను యువతి ఫేస్‌బుక్ ఐడీ ద్వారా పోస్ట్ చేశాడు. దీంతో భర్త, బంధువులు, చుట్టాలు, స్నేహితుల వద్ద మహిళ పరువుపోయింది. అవమానాలకు గురైంది. అందరూ తప్పుగా అర్థం చేసుకోవడంతో ఆమె తలఎత్తుకోలేకపోయింది. ఈ ఫోటోలే భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలకు కారణమయ్యాయి. భార్యా భర్తలు విడిపోయారు.
 
 ఇంత జరిగినా నిందితుడు కనికరించలేదు. బాధిత మహిళను మరింత వేధించడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకపోతే మరింత పరువుపోయేలా చేస్తానని ఇటీవల బెదిరించడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటున్న బాధిత మహిళ నిందితుడిపై ఈ-మెయిల్స్ ద్వారా దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టెన్స్‌లో విచారణ జరిగింది. నేరం రుజువుకావడంతో నిందితుడికి 6 నెలల జైలుశిక్ష విధించిన న్యాయస్థానం, శిక్షాకాలం ముగిసిన తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టాలని తీర్పునిచ్చింది. నిందితుడు లెబనాన్‌కు చెందిన వయసు 43 సంవత్సరాల వ్యక్తి అని, బాధితురాలు అల్గెరియన్ మహిళని అధికారులు తెలిపారు.