:: Welcome to NRI - Article ::

ట్రంప్‌కూ గెలిచే అవకాశాలున్నాయి: హిల్లరీ

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో పది రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అటు ప్రధాన అభ్యర్థులుగా బరిలో ఉన్న డెమొక్రటిక్ హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్‌ మధ్య ప్రచార హోరు మిన్నంటుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ప్రచారం నువ్వానేనా అన్న రీతిలో సాగుతుండటంతో వైట్‌హౌస్ ఎవరికి దక్కనుందనే ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. సర్వేల్లో హిల్లరీకి, ట్రంప్‌కు మధ్య ఉన్న తేడా అంతకంతకూ తగ్గుస్తూ వస్తోంది. తాజా సర్వేల ప్రకారం హిల్లరీ కంటే ట్రంప్ ఒక పాయింట్ వెనుకబడి ఉన్నట్టు తేలడంతో ఈసారి ఫలితం అనూహ్యంగానే ఉండబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. హిల్లరీ సైతం ఏమాత్రం అలసత్వం పనికిరాదంటూ తన మద్దతుదారులను తాజాగా హెచ్చరించారు. ట్రంప్‌కు కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని తన మద్దతుదారులంతా మరో పది రోజుల పాటు ప్రజల్లోనే ఉండి ప్రచారం సాగించాలని హిల్లరీ పిలుపునిచ్చారు. ప్రైవేటు ఇ మెయిల్ స్కామ్‌ తనను ఇప్పటికీ వెన్నాడుతుండటం, ఈ స్కామ్‌లో ఎఫ్‌బీఐ మరోసారి విచారణ మొదలపెట్టడం హిల్లరీని ఇరకాటంలో పెట్టింది. ఎఫ్‌బీఐ వద్ద కొత్తగా ఉన్న  ఆధారాలేమిటని హిల్లరీ నిలదీస్తున్నా ఆ ప్రభావం హిల్లరీ విజయావకాశాలపై పడుతుందేమోనన్న ఆందోళన ఆమె తరపు ప్రచారం సాగిస్తున్న ప్రచార కమిటీలోనూ కనిపిస్తోంది. కొత్తగా వెలుగుచూసినట్టు చెబుతున్న ఇ-మెయిల్స్ ఎఫ్‌బీఐ జూలైలో మూసివేసిన కేసుకు సంబంధించినవా కావా అనేది ఎఫ్‌బీఐ తేల్చిచెప్పాలని లీడింగ్ డెమొక్రటిక్ సెనెటర్ల, హిల్లరీ ప్రచారకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Loading...