trump-decisions-

డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్‌సన్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ మైక్ పొంపెయోను నియమించారు. సీఐఏ డైరెక్టర్‌‌గా గినా హాస్పెల్‌ను నియమించారు. ట్రంప్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో ఈ వివరాలు వెల్లడించారు. సీఐఏ డైరెక్టర్ మైక్ పొంపెయో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ పదవిని అద్భుతంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. రెక్స్ టిల్లర్‌సన్ చేసిన సేవలకు ధన్యవాదాలు తెలిపారు. సీఐఏ డైరెక్టర్‌గా గినా హాస్పెల్‌ను నియమిస్తున్నట్లు, ఈ పదవికి ఎంపికైన తొలి మహిళ ఆమేనని పేర్కొన్నారు. అందరికీ అభినందనలు తెలిపారు.

 
టిల్లర్‌‌సన్‌కు ఉద్వాసన తప్పదని గత అక్టోబరు నుంచి ఊహాగానాలు వస్తున్నాయి. ట్రంప్, టిల్లర్‌సన్‌ మధ్య గత అక్టోబరు నుంచి ఘర్షణ వాతావరణం ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది.