TRS-MP-raises-Issue-of-students-arrests-in-US

అమెరికాలో విద్యార్థుల అరెస్టులపై పార్లమెంటులో గళమెత్తిన తెలంగాణ ఎంపీ

న్యూఢిల్లీ: అమెరికాలో అరెస్టయిన తెలంగాణ విద్యార్థుల గురించి తెలంగాణ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంటులో గళమెత్తారు. ఆ విద్యార్థులకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. విద్యార్థి వీసాలతో అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వారిని పట్టుకునేందుకు అక్కడి హ‌ోంలాండ్ సెక్యూరిటీ విభాగం చేసిన నకిలీ యూనివర్సిటీ వలలో సుమారు 600మంది విద్యార్థులు చిక్కారు. వీరిలో 146మంది వరకు అరెస్టయ్యారు కూడా. అరెస్టయిన వారిలో అధికభాగం భారతీయులు.. అందునా తెలంగాణకు చెందిన వారే ఎక్కవగా ఉన్నారని జితేందర్ రెడ్డి  అన్నారు. జీరో అవర్‌లో ఈ సమస్యను పార్లమెంటు ముందుంచారు. తెలంగాణకు చెందిన విద్యార్థుల్లో కూడా తన నియోజకవర్గమైన మహబూబ్‌నగర్ నుంచే ఎక్కువమంది విద్యార్థులు అమెరికా పన్నిన వలలో చిక్కారని చెప్పారు. చాలామంది విద్యార్థులు అప్పులు చేసి అమెరికా వెళ్లారని, ఫార్మింగ్టన్ వర్సిటీ నకిలీదని వారికి తెలియదని అన్నారు. మోసం చేసిన ఏజెంట్లు, తప్పు చేసిన కొంతమంది విద్యార్థులతో అందరినీ జమ కట్టకూడదన్నారు.