Three-students-who-belongs-to-Telangana-died-in-Australia-

ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి

నల్లగొండకు చెందిన ఇద్దరు, హైదరాబాద్‌ వాసి ఒకరు

  • మూనీ బీచ్‌లో సముద్రంలో మునిగి మృత్యువాత
నల్లగొండ: ఆస్ట్రేలియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాఫ్‌ హార్బర్‌ సమీపంలోని మూనీ బీచ్‌లో గల్లంతై తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు, హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తి ఉన్నారు. నల్లగొండలోని మాన్యంచెల్కకు చెందిన గౌసుద్దీన్‌(45), హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌కు చెందిన రాహెత్‌(35) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడ్డారు. నల్లగొండ శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఎండీ అబ్దుల్‌ జునైద్‌(26) ఆరేళ్ల క్రితం ఎం ఫార్మసీ చదివేందుకు బ్రిస్బేన్‌ వెళ్లాడు. పీఆర్‌ కోసం ఇంటెన్సివ్‌ కోర్సు అభ్యసిస్తూ అక్కడే పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. క్రిస్మస్‌ సెలవులు రావడంతో గౌసుద్దీన్‌, రాహెత్‌ కుటుంబాలు కాఫ్‌ హార్బర్‌ సమీపంలో ఉన్న మూనీ బీచ్‌లో విహారయాత్రకు వెళ్లాయి.
 
వారితోపాటు జునైద్‌ కూడా వెళ్లాడు. కుటుంబ సభ్యులతో కలిసి గౌసుద్దీన్‌, జునైద్‌, రాహెత్‌లు సముద్ర స్నానం చేసేందుకు వెళ్లిన సమయంలో అలలు రావడంతో ముగ్గురూ గల్లంతయ్యారు. గమనించిన పోలీసులు గౌసుద్దీన్‌, రాహెత్‌ల మృతదేహాలను వెలికితీశారు. జునైద్‌ మృతదేహం కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గౌసుద్దీన్‌ కుమారుడు అకీబ్‌, కుమార్తెలు ఈషా, రమ్షాలు కూడా నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది కాపాడారు. జునైద్‌, గౌసుద్దీన్‌ కుటుంబ సభ్యులను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. జునైద్‌ మృతదేహాన్ని జిల్లాకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.