This-mysterious-object-could-be-an-alien-spaceship

అది ఏలియన్స్‌ వాహకనౌక!

‘ఓ మువా మువా’పై శాస్త్రవేత్తల సందేహం

సౌరవ్యవస్థలో జీవ ఉనికిని తెలుసుకొనేందుకు వచ్చి ఉండొచ్చు?
మస్సాచుసెట్స్‌, నవంబరు 8: గ్రహాంతరవాసులు మన సౌరవ్యవస్థ గురించి తెలుసుకొనే ప్రయత్నం చేశారా? ఉల్క మాదిరి వస్తువులో ‘పర్యాటకుడి’గా వచ్చి వెళ్లారా? ‘ఓ మువా మువా’ అసలు గుట్టు ఇదేనా? అది ఒక అంతరిక్ష వాహక నౌకా? ఖగోళ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్న సందేహాలివి! ఏడాది క్రితం ‘ఓ మువా మువా’ అనే ఉల్క మన సౌరవ్యవస్థలోకి వేగంగా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పరిశోధన చేసిన హార్వర్డ్‌ స్మిత్సోనియాన్‌ సెంటర్‌ ఫర్‌ ఆస్ట్రోఫిజిక్స్‌ శాస్త్రవేత్తలు ఒక పరిశోధనా పత్రం సమర్పించారు. ఇది సౌరవ్యవస్థలోని జీవ ఉనికిని కనుగొనేందుకు వచ్చిన కృత్రిమ కాంతి తెరచాప అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.
 
మొదట్లో గ్రహశకలం, తోకచుక్క వంటి లక్షణాలను ఈ వస్తువులో గమనించారు. అయితే అసాధారణ వేగం చూసి సందేహిస్తున్నారు. సోలార్‌ రేడియేషన్‌గా భావిస్తున్న ఈ ఒత్తిడిపై శాస్త్రవేత్తలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనినో కృత్రిమమైన వస్తువుగా అనుమానిస్తున్నారు. శిథిల వస్తువు రూపంలో ఉన్నా.. అత్యాధునిక సాంకేతికతతో నక్షత్ర మండలంలో కాంతి తెరచాప ఆధారంగా కదిలి ఉండొచ్చని అంటున్నారు.