These-people-are-happy-with-Gulf-life

మెతుకు వేటలో ఆనందాల ఊట

మారిన గల్ఫ్‌ కూలీలు, కార్మికుల బతుకుచిత్రం

సొంతూర్లో భూములు కొని, ఇళ్ల నిర్మాణం
బండపల్లి గ్రామస్థుల విజయగాథ 

వేములవాడ-చందుర్తి: పొట్టకూటి కోసం వెళ్లి ఏజెంట్లు, యజమానుల చేతుల్లో మోసపోయిన బతుకులు.. కుటుంబ సభ్యులకు దూరమై ఏళ్లుగా జైళ్లకు పరిమితమైన జీవితాలు.. గల్ఫ్‌ వలసల మాటెత్తితే అక్కడికి వెళ్లిన వారి కన్నీటి కష్టాలే స్ఫురణకొస్తాయి! అయితే, సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామ ప్రజల జీవితాల్లో మాత్రం గల్ఫ్‌ వలసలు వెలుగులు నింపాయి. నిన్నటిదాకా గుక్కెడు గంజి కోసం వగచిన వారు.. పిల్లాపాపలకు కడుపునిండా తిండి పెట్టగలుగుతున్నారు. గుడిసెల స్థానాల్లో చక్కగా ఇళ్లు కట్టుకున్నారు. మొత్తంగా ఆ ఊరు ముఖచిత్రమే మారిపోయింది! ఇలా గల్ఫ్‌ వలసలు ఆనందమయ జీవితానికి చిరునామా కూడా అని  వారు  గొప్పగా నిరూపిస్తున్నారు. 1970 దశకం వరకు బండపల్లి గ్రామం సమస్యలకు నిలయంగా ఉండేది. సాగుపనులు, ఉపాధి లేక యువకులు ఖాళీగా ఉండేవారు. ఈ పరిస్థితుల్లో గల్ఫ్‌లో ఉపాధి అవకాశాలు గ్రామస్థులను ఆకర్షించాయి. గ్రామం నుంచి తొలిసారిగా కోరె మల్లయ్య అనే వ్యక్తి ఉపాధి కోసం 1970లో మస్కట్‌కు వెళ్లాడు. తర్వాత గల్ఫ్‌ దేశాల ఉపాధి వేట జోరందుకుంది.  భవన నిర్మాణరంగంలో, హోటళ్లలో, ఒంటెలు, మేకల కాపర్లుగా పనిచేసేందుకు గ్రామం నుంచి పెద్దసంఖ్యలో యువకులు సౌదీ, యూఏఈ, ఒమాన్‌, ఖతార్‌, కువైత్‌కు వెళ్లడం మొదలైంది. నాలుగు దశాబ్దాల్లో బండపల్లిలో ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున గల్ఫ్‌ ప్రవాసీయులు ఉండడం విశేషం. బండపల్లిలో ప్రస్తుతం 540 ఇళ్లు ఉన్నాయి. గల్ఫ్‌.. ఇతర దేశాల్లో సుమారు 300మందికిపైగా ఉపాధిపొందుతున్నారు. తమ ఖర్చులకు కొంత ఉంచుకుని మిగతా సొమ్మును ఇంటికి పంపడం అలవాటుగా  మార్చుకున్నారు. దీంతో నిన్నటిదాకా కూలీలుగా, కార్మికులుగా ఉన్న యువకులు సొంతూరుకొచ్చి భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. మరికొందరు  వ్యాపారులుగా మారారు. అప్పట్లో బండపల్లి గ్రామానికి బ్యాంకు అధికారులు క్యూ కట్టేవారు. బకాయి వసూళ్ల కోసం కాదు.. డబ్బులను బ్యాంకులో డిపాజిట్‌ చేయమని ప్రజలను కోరేందుకు. అప్పట్లోనే గ్రామానికి నెలకు రూకోటికిపైగా విదేశాల నుంచి సొమ్ము వచ్చేదట! 
 
గల్ఫ్‌.. నా జీవితాన్నే మార్చింది
 
‘‘గ్రామంలో అందరికన్నా ముందు 1970లో మస్కట్‌ వెళ్లాను. తర్వాత జోర్డాన్‌, దుబాయ్‌, దోహా ఖతార్‌, బహ్రెయిన్‌ తదితర దేశాల్లో పనిచేశాను. దాదాపు 30 ఏళ్లు గల్ఫ్‌లో  ఉండి వచ్చినడబ్బుతో గ్రామంలో పది ఎకరాల దాకా సాగు భూమి కొన్నాను. మూడు బోర్లు వేశాను. రెండు ఇళ్లు కట్టుకున్నాను. ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేశాను. గల్ఫ్‌లో ఉపాధి నా జీవితాన్నే మార్చేసింది’’
-కోరె మల్లయ్య
 
ఆర్థిక ఇబ్బందులు తొలిగాయి
 
‘‘గల్ఫ్‌లో పనిచేయడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. బతకుదెరువు లేని పరిస్థితి నుంచిసొంతంగా వ్యవసాయం చేసుకునే స్థాయికి చేరుకున్నాను.    గ్రామంలో పాఠశాల అభివృద్ధికి నావంతుగా సాయం చేస్తున్నాను’’
-గడ్డం శ్రీనివాస్‌రెడ్డి
 
గల్ఫ్‌ ఆదాయంతో బాగుపడ్డాను..
‘‘గల్ఫ్‌ దేశాల్లో పనిచేయడం ద్వారా వచ్చిన ఆదాయంతో నా జీవితం బాగుపడింది. సౌదీ అరేబియాతో పాటు దుబాయ్‌లో కొంతకాలం పనిచేయగా వచ్చిన ఆదాయంతో వేములవాడలో ఒక ఇల్లు నిర్మించుకున్నాను. గుడి నిర్మాణానికి రూ. 30 వేలు విరాళంగా ఇచ్చాను. త ండ్రి జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నాను’’ 
-లింగంపల్లి బాబు