Telugu-youth-suicide-in-Saudi

సౌదీలో సిరిసిల్ల యువకుడి ఆత్మహత్య

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): ఎడారి దేశంలో ఖర్జూరపు తోట! సాయంసంధ్యవేళ పిల్లగాలి మధ్య ఆ తోట కావలి ఉన్న యువకుడిలో ఎన్నో ఆశలు! అప్పులన్నీ తీర్చేసి.. హాయిగా ఇంటికి వెళ్తాననే కలలు!! ‘లెక్కకు మిక్కిలి’గా ఉన్న అప్పులను తాను తీర్చగలనా? అన్న బెంగ! ఆశనిరాశల మధ్య కొట్టుమిట్టాడిన ఆ యువకుడు చివరికి అప్పులు తీర్చడం తన వల్ల కాదని నిర్ణయించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్‌కు చెందిన 22 ఏళ్ల కోడూరి ప్రశాంత్‌ విషాదాంతమిది! ఇంటర్‌ వరకు చదివిన ప్రశాంత్‌.. సోదరి పెళ్లి కోసం, సాగు పనులకు ట్రాక్టర్‌ను కొనేందుకు అప్పు చేశాడు. ఆ ఆప్పులను తీర్చేందుకు మళ్లీ అప్పులు చేసి సౌదీకి వచ్చాడు. ఖర్జూరపు తోటలో రూ.16వేల వేతనానికి పనికి కుదిరాడు. కాగా గల్ఫ్‌కు వచ్చే క్రమంలో.. ట్రాక్టర్‌ ద్వారా వచ్చే ఆదాయంతో బ్యాంకు బకాయిలు తీర్చాలని తన స్నేహితుడికి సూచించాడు. కానీ, అతడు బకాయిలు చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. ఆ విషయాన్ని తేల్చుకునేందుకు సొంతూరుకు వెళ్దామంటే యజమానితో మరో నాలుగు నెలల ఒప్పందం ఉంది. అప్పటిదాకా ఆగితే.. అప్పులు ఇంకా పెరిగిపోతాయి. ఇదంతా ఆలోచించి.. మనస్తాపానికి గురైన ప్రశాంత్‌ రెండు రోజుల క్రితం తన గదిలో ఉరివేసుకున్నాడు.