telugu-youth-dead-body-kept-in-saudi-from-one-year

ఏడాదికిపైగా మార్చురీలోనే మృతదేహం

సౌదీలో మృతిచెందిన పెంటపాడు యువకుడు
అయినవారి ఆచూకీ తెలియక తరలింపులో జాప్యం
ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ప్రతినిధి: దేశం కాని దేశం వెళ్లాడు...అక్కడ చనిపోయాడు..అయిన వాళ్ల ఆచూకీ అధికారులకు తెలియకపోవడంతో ఏడాదికిపైగా అతని మృతదేహం ఆ దేశంలోనే ఉండిపోయింది. వివరాలు...సౌదీ అరేబియాలోని దమ్మాంలో ఓ గదిలో 2017 మార్చి 30న ఓ యువకుడు మృతిచెంది కనిపించాడు. అక్కడి పోలీసులు అతనిది సహజమరణమని నిర్ధారించారు. పాస్‌పోర్టు ఆధారంగా అతడి పేరు మేడం రవీంద్ర అని, తల్లిదండ్రులు సూర్యనారాయణ, సింహాచలం అని, ఊరు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు అని ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి పంపాలంటే కుటుంబసభ్యుల అఫిడవిట్‌ కావాలని, వారికోసం ఎంత ప్రయత్నిస్తున్నా ఆచూకీ తెలియడం లేదని అధికారవర్గాలు అంటున్నాయి. మృతునికి సంబంధించిన సమాచారం తెలిసినవారు సమీప ఆంధ్రజ్యోతి కార్యాలయంలో సంప్రతించవచ్చు.