Telugu-woman-faced-problems-in-Dubai

అరబ్‌షేక్‌ చెరలో వివాహిత

ఏజెంట్‌ మాటలు నమ్మి 4నెలల క్రితం దుబాయ్‌కి

సరైన తిండి లేదు.. గదిలో నిర్బంధించి చిత్రహింసలు
రూ.1.4 లక్షలిస్తేనే తిప్పిపంపుతానని స్పష్టీకరణ
అక్కడ కష్టాలపై వీడియో.. భర్తకు వాట్సాప్‌ 

శంషాబాద్‌రూరల్‌, ఫిబ్రవరి 12: దేశం కాని దేశంలో పని అయినా మంచి వేతనం ఇస్తారు... ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసరా అవ్వొచ్చు.. ఆ వివాహిత ఇలాగే ఆలోచించింది. కట్టుకున్న భర్త, ఇద్దరు పిల్లలకు పైలం అని చెప్పి దుబాయ్‌కి వెళ్లింది. అక్కడ అడుగుపెట్టాక ఆమె కలలన్నీ కల్లలయ్యాయి. నమ్ముకున్న ఏజెంట్‌ నిండా ముంచాడు. దుబాయ్‌ షేక్‌ వద్ద రూ. 1.4 లక్షలు తీసుకొని ఆమెను అక్కడ పనికి కుదిర్చాడు. అతడేమో ఆమెకు చిత్రహింసలు పెడుతూ నిత్యనరకం చూపిస్తున్నాడు. సరైన తిండి కూడా పెట్టకుండా గదిలో నిర్బంధించాడు. కడుపునిండా తిండి.. కంటినిండా నిద్రలేక నాలుగు నెలల నుంచి ఆమె షేక్‌ చెరలో నానా కష్టాలు అనుభవిస్తోంది. ఈ సమస్యలకు తోడు గుండె సంబంధవ్యాధి తిరగబెట్టడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన ధనలక్ష్మి అనే వివాహిత గోస ఇది. బతుకుదెరువు కోసం భర్త దుర్గాప్రసాద్‌తో  కలిసి  ధనలక్ష్మి ఏడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, తొండుపల్లికి వచ్చింది. ఈ దంపతులకు కూతురు రూపారాణి, కొడుకు షణ్ముఖ  ఉన్నారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో ఆమె పనిచేసేది. ఈ క్రమంలో తొండుపల్లిలో ఉండే ఏజెంట్‌ శ్రీనివా్‌సతో ధనలక్ష్మికి పరిచయం ఏర్పడింది. దుబాయ్‌లో పనిచేస్తే మంచి జీతం ఇస్తారని ఆమెకు శ్రీనివాస్‌ ఆశ పెట్టాడు.  దీంతో భర్త, పిల్లలను వదిలి ఒంటరిగా ఏజెంట్‌తో శ్రీనివా్‌సతో కలిసి ఆమె నిరుడు నవంబరు 9న దుబాయ్‌కి వెళ్లింది. దుబాయ్‌లో ధనలక్ష్మిని తొలుత మంచిగానే చూసుకున్న అరబ్‌ షేక్‌ ఆ తర్వాత నరకం చూపెట్టాడు. తాను అక్కడ అనుభవిస్తున్న కష్టాలను ధనలక్ష్మి వీడియో రూపంలో భర్తకు పంపింది. తన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని కన్నీటిపర్యంతమైంది. స్వదేశానికి పంపమని అడిగితే.. ఏజెంట్‌ తీసుకున్న రూ.1.4లక్షలు చెల్లించాలంటూ షేక్‌ వేధిస్తున్నాడని వాపోయింది. 
 
మా అమ్మను కాపాడండి: పిల్లలు
దేశం కాని దేశంలో తల్లి నానా కష్టాలు అనుభవిస్తోందని తెలిసి కూతురు రూపారాణి, కుమారుడు షణ్ముఖ తల్లడిల్లుతున్నారు. మస్కట్‌లో అరబ్‌ షేక్‌ చెర నుంచి తల్లిని కాపాడాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. లేదంటే.. తమకు ఆత్మహత్యే శరణ్యమని భోరున విలపించారు. తన భార్యను భారత్‌కు తిప్పి పంపించాలని కోరినా ఏజెంట్‌ శ్రీనివాస్‌ స్పందించడం లేదని బాధితురాలి భర్త దుర్గాప్రసాద్‌ వాపోయాడు. భార్య తనతో మాట్లాడుతోందని, తక్షణం రూ.1.4 లక్షలు ఇస్తే పంపిస్తానని, లేదంటే రెండేళ్ల వరకు అక్కడే ఉండాల్సి వస్తుందని అరబ్‌షేక్‌ స్పష్టం చేసినట్టు చెప్పిందని వివరించాడు. 3 నెలలుగా ధనలక్ష్మి నెలకు రూ.15వేలు ఇంటికి పంపిస్తోందని ఆయన చెప్పాడు. కాగా అమాయక మహిళలను ఉపాధి పేరుతో ఏజెంట్లు మోసం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని తొండుపల్లి సర్పంచ్‌ బక్క రత్నం డిమాండ్‌ చేశారు.